12. హృదయము - అంత:కరణ

12. హృదయము - అంత:కరణ

    ప్రవచనము గైకొనిన వాని మనస్సు విశాల పరచ బడును. ప్రవచనము వినవలెననిన ముందుగా అతని అంత:కరణ సంకుచితత్వము నుండి విశాల పరచ బడవలెను. పౌలు అను అపొస్తలుడు ఈలాగు వచించు చున్నాడు. ''మా హృదయము విశాల పరచబడి ఉన్నది. మీ అంత:కరణ సంకుతమై ఉన్నది. మీయెడల మాకున్న అంత:కరణమునకు మీరును మీ హృదయము విశాల పరచుకొనుడి'' (2కొరింథి 6:11-13).  నుక విశ్వాసుల అంత:కరణ విశాల పరచుకొనుట అనగా ఆత్మానుసారముగాను, ప్రేమతోను ఉండుట. అప్పుడే ప్రవచనములను గైకొనగలరు. ప్రవచించు వారు దైవజనులు కనుక, హృదయ విశాలము వలన విశ్వాసి క్రీస్తుగా పరిణామము పొందును. ఎందుకనగా  సంకుచితమైన అంత:కరణ విశాలమైనచో హృదయ ద్వారమును తట్టి తెరిపించును  (తట్టుడి తెరవబడును అను వాక్యము) మరియు తన శరీరమునకు సంబంధించిన స్వభావముచే యేర్పడిన వ్యక్తిత్వము నశించును. అట్టి విశాల పరచ బడిన అంత:కరణ దైవమునకు చోటు కల్పించును.

    నీ హృదయములో ఆయన వశించుచున్నాడు. ''తనను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలు(అంత:కరణ) యేర్పరచెను. ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండువాడు కాదు'' (అపొ||కా 17:27). హృదయ ద్వారము తెరవ బడినచో ఆయన మనలోనే ఉన్నాడను జ్ఞానము కల్గును.

    నిజమైన క్రీస్తు స్థితిలో ప్రతిష్టితము కావలెనన్న విశ్వాసులు దేవుని విషయమై ఆయన అందరి హృదయములలో ఏకత్వముగా నున్నట్టి యేసుక్రీస్తుగా ఉన్నాడని ఎరుగ వలెను. దీనికి బోధ ఇట్లుండెను.

    నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నడచుకొనుడి. ''అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడును నేనే. మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను, అని ప్రభువు సెలవిచ్చెను'' (ప్రకటన 2:23). ''మీరు విశ్వాసము గలవారై యున్నారో లేదో మిమ్ములను మీరే శోధించుకొని చూచుకొనుడి,  మిమ్ములను మీరే పరీక్షించు కొనుడి'' (2కొరింథి 13:5).

    జనులు శరీరములుగా చూచినచో అనేకులుగా నున్నారు. ఒకడు తన హృదయమును తెలిసికొనినచో, అందు నివశించు దైవము సర్వవ్యాపకమై యున్నట్లు జ్ఞానమును పొందును. అందు వలన దేవుడు ఒక్కడే అందరి హృదయములలో ఏకత్వముగా వశించు చున్నాడడని తెలియును. కనుక హృదయములను పరీక్షించు కొనిని వాడు శోధకుడు. శోధకుడైన విశ్వాసి దైవమును తెలిసి కొన గలడు. దైవమును తెలియుటయే జ్ఞానము. జ్ఞానమనగా దైవము. జ్ఞాని యైన వాడును దైవమే. అట్టి దైవమే సత్యము, ఏకము, నిత్యము, సర్వము అయి ఉన్నాడు మరియు లక్ష్యమును, గమ్యమును, అనుభూతియు అయి కూడా ఉన్నాడు.







దైవ ప్రార్ధన

1.దయామయుడగు ఓ ప్రభువా! నామాట చేతను, క్రియ చేతను మరియు ఆలోచనలలో కూడా ఏ విధమైన హాని యెవరికిని కలుగనీయక, మెలుకవ లోను, కలలోను మరియు గాఢనిద్రలో కూడా నిన్ను  ఆరాధించు వానిగా నుండు లాగున నన్ను అనుగ్రహించుము.

2. కరుణామయుడగు ఓ ప్రభువా! నా మాట చేతను, క్రియ చేతను మరియు ఆలోచనలలో కూడా సర్వకాల సర్వావస్థలలో ప్రపంచములో ఏ జీవికైనను నా వలన ఉపకారము జరుగునట్లును, నేను అందరి యందును ప్రభువునే చూడ గల ప్రేమ స్వభావము నాకు లుగు లాగున నన్ను ఆశీర్వదించుము.

3.జ్ఞాన స్వరూపుడవగు  ఓ ప్రభువా! నా మెలుకువ లోను,  కలలోను మరియు గాఢ నిద్రలోను ఈ మూడు అవస్థలకు మూలమైన నా యొక్క అవయవములలోను, ఇంద్రియములలోను, శరీరానుసారమైన మనస్సులోను ఏ విధమైన దోషములు, చెడు తలంపులు కలుగ నీయ కుండా, నేను సదా ప్రభువు నామమునే ధ్యానించు లాగున నన్ను ఆశీర్వదించుము.

4. తండ్రికి ప్రియమైన ఓ ప్రభువా! నాపై ఎవరెన్ని నిందలు మోపినను, నాకు హాని చేసినను, అవి అన్నింటిని సహించగల సహనమును, ఓర్పును, నాకు దయ చేసి తిరిగి వారికి హాని కల్గించుటకు బదులుగా, వారిని క్షమించు హృదయమును నా కొసంగుము. ఏ పరిస్థితులలో నైనను సత్యస్వరూపియైన నిన్ను విశ్వసించుటలో నా మనస్సు కొంచమైనను చలింపకుండునట్లు నన్ను అనుగ్రహించుము! ఆశీర్వదించుము!

ఉజ్జీవ ప్రార్ధన

ఓ ప్రభువా!  దైవ కుమారా!  స్వర్గ రాజ్యములోనూ, భూమి పైన ఉన్న సత్య స్వరూపా ! నీ నామము వైభవో పేతముగా వెలుగొందుగాక! 

నీ ఉజ్జ్వల సామ్రాజ్య వైభవము వచ్చి యున్నది.

స్వర్గ రాజ్యములో వలెనే భూమిపై కూడా నీ ఇచ్ఛ నెరవేరుతుంది!

నన్ను ప్రలోభములోనికి నడిపించక చెడునుంచి మంచికిని మరియు మంచి చెడుల నుండి క్రీస్తు లోనికి నడిపించుము!

ఈ సామ్రాజ్యము, శక్తి, వైభవము ఎప్పటికిని నీవే గనుక ఓ ప్రియతమా! కరుణామయా! నన్ను క్రీస్తు యేసుగా ఉజ్జీవింజేసి, నాలో నివశించు పరిశుద్ధాత్మగా నిన్ను నాకు వ్యక్త పరచుము ప్రభూ!