ముందుమాట

ముందుమాట

 తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ

 ప్రభువు ఆజ్ఞచే నిర్ణయించ బడిన '' నా కృప నీకు చాలును'' రీతిగా అందించిన స్ఫూర్తిని వ్యక్తీకరించిన యీ చిన్న ప్రయత్నము ''కీస్తు యేసుగా ప్రకటితము''.

    దైవము ఒక్కటే. సృష్టి ఆది నుండి దైవకుమారుడు యెహోవాతో ఐక్యమగు స్థితి వరకూ గల సమస్తము పరిశుద్ధగ్రంథము నందు యదార్ధ జ్ఞానముగా నున్నది. ప్రతి మనిషి పరలోక సామ్రాజ్యమునందు సుస్థిరతను పొందుటకు జీవనము ఏ రీతిగా జరుగ వలెనో ఆత్మానుసార జీవితముగా వర్ణించ బడిన సమస్త వాక్యములను ప్రోగుచేసి సాధనా క్రమముగా కూర్చి అందించ బడిన ఆశీర్వాదమిది.

    పరిశుద్ధ గ్రంథమును జ్ఞానపరముగా పఠించగా నద్దానిని వివరించుటకు గాను జ్ఞాన వాక్యములను యెంచి ఒక వరుస క్రమములో పేర్చుట జరిగినది. ఆ వాక్యములను అర్థవంతముగా చేయుటకు గాను ఆ గ్రంథములోనే నున్న మరికొన్ని వాక్యములను వివరణాత్మకముగా మార్చి కూర్చడమైనది. ఈ విధముగా యేర్పడిన పాఠమును ఒక చార్టు ద్వారా తెలియపరచుటకు ప్రయత్నము జరిగినది. ఆ తెలియ పరచుటకు దైవము నుండి దిగి వచ్చిన సృష్టిని, మానవుని, అటులనే యేసుక్రీస్తు అను నరుని మరియు యోహాను అను సాక్షిని చార్టు ద్వారాను, బొమ్మల ద్వారాను వివరించ బడినది.

    ఈ క్రమమును అందించుటకు అవసరమైన అనుసంధాన విషయములను జత పరచుట జరిగినది. ఈ విధముగా బయలు పరచ బడిన పాఠమును ఒక సారి పరిశీలించిన పిదప అవసరమైన చోట వాక్యములలోని పదములను మరింత స్పష్టముగా వివరించుట జరిగినది. ముందు వివరించిన వాటికి సరి అయిన దృక్కోణము లభించగా అనేక మార్పులు జరిగినప్పటికిని, మూలమైన పవిత్రగ్రంథ వాక్యములను, వాటి భావములను మార్పు చెందకుండు నట్లు జాగ్రత్త వహించట మైనది.

    ఈ విధముగా తయారైన గ్రంథ విషయముననుసరించి, ప్రభుస్తుతి, ప్రార్ధన సాధన, తత్త్వములు మొదలైన వానిని తగినచోట అనుసంధించడమైనది. ఇందుకు సహకరించిన విశ్వాసులందరికి కృతజ్ఞతాస్తుతులు అందజేయడమైనది.

    పలువురు అనుభవజ్ఞుల సహాయ సహకారములతో చేర్పు కూర్పులను చేపట్టుట జరిగినది.  యదార్ధవిషయములు అనుభవస్థితులన్నీ సత్యానుభవముగల మహనీయుల పర్యవేక్షణ యందు పరిశీలించ బడినవి. దైవ కృపచే అంతయూ సమర్థవంతముగా నిరాటంకంగా నెరవేర్చ బడినది.

    దేవుని చిత్తము నెరవేర్చబడుటలో అవకాశము కలిగిన వారందరూ ధన్యులు.

                        ఆమెన్‌!!