1.రక్షణ

క్రీస్తు యేసుగా ప్రకటితము

(సాధన క్రమము)

1.రక్షణ

     తండ్రియైన యెహోవా తనకిచ్చిన అధికారముతో యేసుక్రీస్తు సత్యము, జీవమునై ఆయన ద్వారానే తండ్రియొద్దకు చేరు మార్గమయ్యెను. అందు వలన నిరాశ నిస్పృహ, శ్రమ, వేదన నొందుచున్న  జనులకు ఒక ఆశాకిరణమై ఆలంబనయై యేసుప్రభువు మన ముందుకు వచ్చెను.

 ''నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.''

                                                                   - (విలాప వాక్యములు 3 - 26)

     మనుష్యులు అజ్ఞానముచే శారీరకముగా, మానసికముగా అనేక శ్రమలు పడుచు భ్రమ చేత వేదనలను పొందుచు శరీర సంబంధ బాధలను, మనస్సుకు సంబంధించిన దు:ఖములను ఓర్పుతో అనుభవింప జాలక దైవము యొక్క అనుగ్రహము కొరకు నిరీక్షించు చున్నారు. దైవము పై భారముంచినందున కొందరు శాంతి నొందుచున్నారు. కాని శాశ్వతమైన శాంతి, సుఖము, ఆనందము దొరకుట లేదు. అయినను అన్యజనులైన నరులు రక్షణ కొరకు ఎదురు చూడకయు వారికి దేవుడైన యెహోవా యందు విశ్వాసము లేకుండిరి. విశ్వాసులైన వారైనను  దేవుడు వాగ్దానము చేసినట్లు నడుచు కొనక వ్యర్ధ క్రియలు జరుపు చున్నారు. రక్షణ పొందు మార్గము తెలియక అన్యదేవతల విగ్రహారాధన జరుపుచు లోక సంబంధ విషయములందు సుఖము కొరకై ప్రయాస పడుచు, వేదన పడుచు  మరణమునకు తీర్పు ఇవ్వ బడుచున్నారు.

    మానవులు దేవుని పోలి యుండియు దేవుని మరచి కష్టాల పాలగుచున్నారు. వారు మరల దేవుని ఎరిగి జ్ఞానమును పొందుటకు తగిన మారు మనస్సు పొంద వలెనని  దేవుని ఆజ్ఞయై యున్నది. ఒక్కడేయైన దేవుడు సర్వోన్నతుడు, సత్యస్వరూపి. కాని నరులు అన్యదేవతలను ఆరాధించుట వలన జ్ఞానమును పొందజాలరైతిరి. సర్వసాక్షి, అద్వితీయుడు అయిన యెహోవాను అజ్ఞానముచే మరచి యుండుట వలన వారి దు:ఖము నశించుట లేదు. అందు వలన వారు చేయు శరీరానుసార క్రియలకు ప్రతిఫలముగా వారికి తీర్పు ద్వారా మరణము కలుగుచున్నది.

          ప్రాచీన కాలమున యెహోవా యందు భక్తి విశ్వాసములు మాత్రమే కలుగులాగున ఆనాటి ప్రవక్తల ద్వారా బోధించుట జరిగినది. జ్ఞానమును ప్రబోధించినను వారు అందుకొన జాలిరైరి. ''ఆ అజ్ఞాన కాలమందు (పాత నిబంధన కాలమందు) దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు నొంద వలెనని మనుష్యులకు ఆజ్ఞాపించు చున్నాడు.'' - (అపొ.కా. 17 - 30).  ఈ వాక్యము నూతన నిబంధనను అనుసరించి చెప్పబడెను.

''దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు''.(కీర్తన 14ః1)

    దేవుని నమ్మని అన్యజనులు, దేవుని గురించి తెలిసినప్పటికి , ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచు కొనని వారు మొదలగు శరీరాను సారులను జీవము గల దేవుని వైపునకు త్రిప్పుట అను  ఆవశ్యకత యేర్పడెను.  అపొస్తలుల ప్రకటన యీలాగున ఉన్నది. ''జీవము గల దేవుని వైపునకు తిరగ వలెనని  మీకును సువార్త ప్రకటించు చున్నాము.'' - (అపొ.కా. 14 - 15).

    ఈ విధమైన అవసరమును  నెరవేర్చుట కొరకు తండ్రియైన దేవుడు క్రీస్తు యేసు అను నరుని తనకు ప్రతినిధిగా పంపెను. అతడే దైవ కుమారుడు.  ''ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను.'' (1ధెస్స 5-9). ''దేవుడు ఒక్కడే , దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అను నరుడు.'' (1తిమోతి 2 - 5).

    కనుక యేసుక్రీస్తును విశ్వసించి ఆయన చూపిన త్రోవలో నడచిన మనకు జ్ఞానము కలుగును. అందువలన మరణమును తప్పించు కొందుము. ఇదియే తండ్రి చేత అనుగ్రహించబడుచున్న రక్షణ. అందరును ''జన్మము వలన యూదులమే(విశ్వాసులమే) గాని అన్యజనులలో చేరిన పాపులు కాదు.'' (గలతీ 2 - 15).  కనుక అందరును రక్షణ పొంద వలెనని దేవుని చిత్తమై యున్నది. ''యేసు మన ప్రభువని ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించ బడుదువు.'' - (రోమా 10 - 9). యేసు ప్రభువు తన శరీరము సిలువ వేయ బడగా, తండ్రి అనుగ్రహమున మృతులలో నుండి లేచి పరలోక సామ్రాజ్యము సుస్థిరమై యిక యెన్నటికిని మరణము లేని స్థితిని పొందెను. కనుక  యేసు క్రీస్తు జీవనము, బోధ, మరణము తెలిసిన నరులకు ఆయన మృతులలో నుండి యేలాగు లేపబడెనో తెలియును, మరియు అట్టి మార్గమును మనమును అనుసరించ వలెను.

    ''తొట్రిల్లకుండ మిమ్ములను కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిల బెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుని మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగును.''  - (యూదా1- 25). అందు వలన తండ్రియైన యెహోవా నరులపై ప్రేమగలవాడై అవసరమైన జ్ఞానమును మనకు ప్రసాదించుటకై తగిన మహిమయు అధికారమును యేసుక్రీస్తుకిచ్చి యుండెను. ఆయన ద్వారా మనకు కలుగు మహిమ, మహత్మ్యము తండ్రికి సంబంధించినవే. మనకు కనబడుచు,  మనలను ప్రేమించుచు, మనలకు బోధించుచు , మనను అనుగ్రహించునట్లు కనుపించునది యేసు ప్రభువైనను,  ఆయన ద్వారా జరుగు ప్రతి కార్యము తండ్రి జరిపించునదియే అయి ఉన్నది. మనము ''తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసు క్రీస్తు నందు భద్రము చేయబడి పిలువ బడిన వారము'' - (యూదా 1-1).

    జ్ఞాన పరముగా మనమందరమును యేసు క్రీస్తు నందు భద్రము చేయ బడిన వారమే. ఈ సంగతి మనకు తెలియక పోవుట మన అజ్ఞానము. అటులనే మనము తండ్రి యొక్క ప్రేమలో ఎప్పుడును మునిగిన వారమే. ఆ విషయము ఆయనకు తెలియును  కాని మనము సాతాను అనెడి అజ్ఞాన పూర్వకముగా  శరీర సంబంధముగా అభిమానమునకు లోబడినవారమై నందున శరీరానుసారులమైతిమి.  అందు వలన తండ్రి ప్రేమకు తగిన రీతిగా తిరిగి మన ప్రేమను పరులకును మరియు ఆయనకును అందించు జ్ఞానము మనకు లేకుండెను. శ్రమలు వేదనలు పొందు          నరులు వారివారి మరణముల నుండి రక్షించ బడుటకు ముందుగానే దేవుని ఆశీర్వాదము మనకు ఉండెను.  అట్టి రక్షణ కొరకు దేవుని మార్గమున నడచు కొనవలెనని,మారు మారు మనస్సు పొంద వలెనని ఆయన ఆజ్ఞయై ఉండెను.  మనమందరమును ఆయన బిడ్డలమే. ఆయన ప్రజలము. యేసు క్రీస్తు, తండ్రిచే పంపబడినందున దైవ కుమారుడు. మన వలె శరీరేచ్ఛ, పాపేచ్ఛల వలన గాక ఆయన పవిత్రాత్మగా జన్మించెను. తల్లి తండ్రుల వలన కలిగిన జన్మము కాదు, శుక్ల శోణితముల కలయిక వలన యేర్పడిన పిండము కాదు. దేవుని మహిమ వలన కన్యక గర్భమందు నుండి జన్మించెను. అందు వలన ఆయన క్రీస్తు అను యేసుగా పిలువ బడుచున్నాడు. ఆయన పవిత్ర జననమే అందుకు సాక్ష్యము. ఏలయనగా అమాయకపు మనస్సునకు సంకేతమే కన్యగర్భము, సృష్టికి ఆదియైన జ్ఞానస్థితికికూడా సంకేతము కన్యక గర్భమే. ఇట్టి కన్యక గర్భమందు దేవుని వెలుగు ప్రవేశించుటకు సాధ్యపడును. మనమునూ మారు మనస్సు పొందినచో మన హృదయములోనూ  దేవుని వెలుగు ప్రవేశించును, అనగా మనము క్రీస్తు స్థితిని పొందగలము.

    మరణమునకు తీర్చ బడు తీర్పు నుండి రక్షణ పొందుటకు మనకు సత్య స్వరూపియైన దేవుని గూర్చియు, ఆయన యొద్దకు చేరు మార్గమును గూర్చియు తెలియ వలెను. తండ్రియైన దేవుడు అదృశ్యుడు కనుక దైవ ప్రతినిధిగా  తన పవిత్ర కుమారుని పంపవలసి వచ్చెను. కనుక ఆయన ద్వారానే రక్షణ కలుగ వలెను. అందుకు యేసు ఈలాగున చెప్పెను.  ''నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు''. - (యోహాను14-6). ఆయనను అనుసరించమని మనకు బోధించుచూ, ఆయన కూడా అటులనే జీవించెను. అందు వలన ఆయనయే మార్గమయ్యెను. యేసు క్రీస్తు సత్యదేవుడైన తండ్రిని పోలియున్నందున, తండ్రికిని కుమారునికిని భేదమే లేదు. అందువలన ఆయన కూడా సత్యము అయి ఉన్నాడు. మరణమును జయించి నిత్యజీవము గల వాడగుటచే ఆయనే జీవము అయి ఉన్నాడు. మనకు సాదృశ్య పరచుటకు క్రీస్తుగా మరణించెను గాని, ఆయన ముందుగానే నిత్యజీవమై యుండెను మరియు ఎప్పుడును నిత్యజీవమే! ఆ జీవమే సృష్టియందంతటను నిండి ఆధారమై ఉండెను. యేసు క్రీస్తు ''తన దాసులకొరకు కనపరచుట కొరకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత''. -( ప్రకటన 1-1). కనుక అదృశ్యుడైన తండ్రి యొక్క కార్యములు యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్ష పరచబడెను. మనకు (ముఖ్యముగా ఆయన దాసులైన వారికి) గోచరమై, మొదట విశ్వాసమును, పిమ్మట జ్ఞానమును ప్రసాదించును.


 రక్షణ నొంద వలసిన జనులు అన్య జనులనియు , క్రియల మూలమైన విశ్వాసులనియు, దేవుని మూలమైన విశ్వాసులనియు , వారికి అవసరమైన బోధను బట్టియు , ప్రవచనమును బట్టియు విభజింపబడి యున్నారు.

    సాధారణముగా నరులు ఎవరికి వారుగా  అజ్ఞానముతో స్వభావమును కలిగి యుందురు. ఈ స్వభావము మూడు గుణములతో కూడి ఉండును. వీరి చిత్తములలో వారి స్వభావమునకు సంబంధించిన విధముగా చేయుటకు నిరంతరము ఇచ్ఛ కలుగు చుండును.

    దీనిని చిత్త వృత్తి అందురు. ఈ వృత్తులు ప్రాణశక్తినుపయోగించి బుద్ధి యందలి జ్ఞాపకముల ద్వారా మనస్సున కందించ బడును. పిదప ఆ మనస్సు పరిస్ధితుల అనుకూలత వ్యతిరేకతల ననుసరించి  వాటిని గురించి ఆలోచించును. ఈ ఆలోచనలు మూడు గుణములైన తమస్సు, రజస్సు, సాత్వికము అను స్వభావముతో కలిసిపోయి యుండును. ఎప్పటికప్పుడు  ఆయా గుణ ప్రధానముగా వీరి బుద్ధి అనేక విధములుగా వారి స్వభావములను పోషించుచు నిర్ణయించుచుండును. ఒక గుణము ప్రధానముగా ఆలోచనగాని, పని జరుగుటగాని అయినప్పుడు మిగిలిన గుణములు అణిగి ఉండును. ఈ విధముగా అతడు జరుపు క్రియలలో తమోగుణము గాని, రజోగుణము గాని లేక సత్వ గుణముగాని కనబడును. ఈ గుణములను బట్టియే అన్యజనులుగా గాని , విశ్వాసులుగా గాని నిర్ణయించ గలము. అది యెట్లనగా

1. తమస్సు (అన్యజనులు)

   త”మోగుణ ప్రధానముగా వ్యవహరించువారు అన్యజనులు. అన్యజనులనగా అవివేకులు, బుద్ధిహీనులు, మూఢులు, అన్యదేవతారాధకులు, సోమరులు, తిండిపోతులు, బద్ధకస్తులు, క్రమ శిక్షణ లేని వారు, అతి నిద్ర పోవు వారు, వీరు సమాజములో ఏ బాధ్యతను నిర్వహించరు మరియు తనకు తాను ఉపయోగ పడరు.

 త”మోగుణ లక్షణమే మనగా  తనను తాను మరియు భగవంతుని మరచి యుండును.

2. రజస్సు (అవిశ్వాసులు)

  రజోగుణ ప్రధానముగా వ్యవహరించువారు భగవంతుని యెడల అవిశ్వాసులుగా నుందురు. వీరు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, దంభ, దర్ప, అహంకారములతోను, రాగ ద్వేషములతోను వ్యవహరింతురు. వీరు స్వార్థపూరితులు, వివాదములు రేపెదరు. వీరు ఇతరులకు హాని కల్గింతురు. మరియు తనకు తాను సుఖమును కోరుచు హాని కల్గించు కొనును.

 రజోగుణ లక్షణమేమనగా వస్తువును యథాతథముగా గుర్తించడు మరియు దానిని వేరొక విధముగా గుర్తించి దాని వలన తొందర పాటుతో భ్రమలో మునిగి  ప్రమాదములో పడును.

3. సత్వము (విశ్వాసి)

   సత్వ గుణ ప్రధానముగా వ్యవహరించువారు ఇతరులకు మేలు చేయు స్వభావము కలవారు.  సహనము, ఓర్పు, దయ, శాంతము, ప్రేమ, త్యాగము కలిగి యుండి, సమాజమునకు సుఖ శాంతులు కలుగ జేయుదురు మరియు తానుకూడా సుఖ శాంతులతో నుండును. వీరు చేయు కర్మలు దైవార్పణ భావముతో నుండును. భగవంతుని యందును, పెద్దల యందును విధేయత, విశ్వాసములు కలిగి యుందురు. వస్తువును, నిష్పక్షపాతముగాను, యథాతథముగాను గుర్తించి వివేకముతో వ్యవహరింతురు. వీరు క్రీస్తు నందు ప్రవేశించుటకు అర్హత కలవారై యుందురు. 

    వీరందరును క్రీస్తు న్యాయస్థానము నందు వారి వారి క్రియలకు తగిన తీర్పులను అనుసరించి  నడచుకొందురు. పై మూడు గుణముల వలన వీరు వేరు వేరు ఫలితములను అనుభవింతురు. ఇవన్నియు సాతాను ప్రేరణ  ఫలితమే. ఇట్టి  శరీరానుసార వృత్తులన్నియు అంత:కరణ వృత్తులన బడును.

       
తీర్పు నుండి రక్షణ

1. సాతాను వలన పాపేచ్ఛ

   పాపేచ్ఛ వలన శరీరేచ్ఛ

   శరీరేచ్ఛ వలన శరీరానుసారం

   శరీరానుసారం వలన మరణం

2. దురాశ వలన దు:ఖం

   తమస్సు వలన మోహం

   రజస్సు వలన కామం

   సాత్వికము వలన శాంతం

3. సాత్వికము వలన ప్రేమ

   ప్రేమ వలన త్యాగం

   త్యాగము వలన తృప్తి

   తృప్తి వలన సంతోషము

4. భక్తి వలన ప్రార్థన

   ప్రార్థన వలన పశ్చాత్తాపం

   పశ్చాత్తాపం వలన రక్షణ

   రక్షణ వలన దీర్ఘశాంతం

5. క్రీస్తు వలన కరుణ

   ప్రభువు వలన ప్రేమ

   ప్రేమతోనే ఆరాధన

   ఆరాధనతోనే మారు మనస్సు

   మనస్సు మారి క్రీస్తు లోకి

   క్రీస్తు నుండి క్రీస్తు యేసుకు

6. తండ్రి వలన యేసు

   యేసు ద్వారా పరిశుద్ధాత్మ

   పరిశుద్ధాత్మ వలన సంచ కరువు

  సంచ కరువుతో పరలోక రాజ్యము.