2.అన్యజనులు

2.అన్యజనులు

     ఇంకను అన్యజనులనగా '' జారత్వము, అపవిత్రత , లోభత్వము కలిగిన వారు. కృతజ్ఞతావచనము లుచ్ఛరించనివారు. పోకిరి మాటలు, సరసోక్తులు ఉచ్ఛరించువారు. తగవు, వ్యభిచారము, విగ్రహారాధన చేయువారు. వీరు వ్యర్థములగు మాటల వలన మోస పోవుదురు. అందువలన అన్యజనులు క్రీస్తు యొక్కయు , దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారులు కాదు. వీరు చీకటియై ఉండిరి. నిష్ఫలమైన అంధకార క్రియలతో పాలివారై ఉందురు. అజ్ఞానముతో అవివేకముతో దేవుని చిత్తమేమిటో గ్రహింప కుందురు. - (ఎఫెసి 5: 3-8)

    జారత్వమనగా మంచి నుండి చెడుకు దిగజారుట, అనగా దుర్గుణములు కలిగి, దుష్ట కార్యములు జరుపు స్వభావము. అపవిత్రత అనగా దేవుని కిష్టమగు కార్యములు చేయక, శరీరానుసారమగు క్రియలను అత్యాశతో జరుపుట. లోభత్వమనగా తనకున్న వస్తువులను,. ధనమును తనకొరకు మాత్రమే ఉంచుకొనుచు, ఇతరులకును, దైవ కార్యములకు వెచ్చించ యిచ్చ లేకుండుట. సహాయము చేసిన వారికి కృతజ్ఞత తెలుపు సంస్కారములేని వారు యీ అన్యజనులు. వీరు చేయు క్రియలు తనకును, యితరులకును సుఖము నివ్వవు. పైగా హాని కల్గించును. వ్యభిచారమనగా తానైన ఆత్మగా కాక, తాను కాని శరీరముగా జీవించుట. (వ్యభిచారము అనగా శారీరకముగా భావించ రాదు).చీకటియై యుండుట అనగా అజ్ఞానములో నుండుటయే గాక, తమోగుణము ఆవరించిన వారై ఉందురు. అంధకార క్రియలు అనగా దుర్బుద్ధితో చేయు క్రియలు. ఇవి పాపమును మూట గట్టి మరణమును కల్గించును.

    అన్యజనులైన వారు దేవుని విశ్వసించక శరీరేచ్ఛతో స్వార్థ పరులై ఉందురు. ''అంధమైన మనస్సు (తమో గుణము) కలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో నున్న అజ్ఞానముచేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరు పరచ బడిన వారు. వారు తమ మనస్సునకు కలిగిన వ్యర్ధతను అనుసరించి నడుచు కొనువారు. నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే  మోహము, కాముకత్వమునకు  అప్పగించు కొనువారు. మోసకరమైన దురాశల వలన చెడిపోవుదురు. ప్రాచీన స్వభావము గలవారై దేవుని ఆజ్ఞలను తిరస్కరించి  అజ్ఞానము వలన (దేవుని) మరచిన వారై యున్నారు.''  - (ఎఫెసి 4: 18-24).

    మోహము తమోగుణము వలన కలుగును. రజోగుణము కోరికలను పెంచును. కోరికల వలన దురాశ పుట్టును. కాముకత్వమనగా రజోగుణమునకు సంబంధించినది. ఈ కాముకత్వమే కామము, మోహము, లోభములను పుట్టించును. కోరికలు తీరనిచో క్రోధము కల్గును. తనకు అడ్డు తగిలిన వారిపై ద్వేషము వ్యక్తము చేయును. ఇతరులు తన కంటే ఎక్కువయని భావము కల్గినంత మాత్రమున ఈర్ష్య , అసూయ, మత్సరములు కలుగును. తానే ఎక్కువన్న భావము వలన మదము, గర్వము కల్గును. ఇవన్నియు జనులను ఆవరించిన అవిద్య వలన కలుగుచుండును. అవిద్య అనగా సాతాను ప్రేరణ.

    సాధారణముగా జనుల స్వభావము జ్ఞానమునకు వ్యతిరేకము. కాని జ్ఞానమును గూర్చిన వివేకము,  మార్గము మరియు దేవుని ఎరిగి, దేవుడగుటను భోదించుచున్నది నూతన నిబంధన గ్రంథము మాత్రమే. అయినను పాత నిబంధన గ్రంథము కొందరిని దైవము వైపు మరలించుటకు తోడ్పడును. అట్టి వారు విశ్వాసులై జ్ఞానము నొందుటకు  నూతన నింబంధన మార్గదర్శకమై ఉన్నది.

    కనుక అన్యజనులు మూఢ విశ్వాసము గలవారై పరిమిత పరచబడిన వారై  యుందురు లేదా దేవుని అస్తిత్వముపై విశ్వాసము లేని వారై ఉందురు. వీరికి విశాల భావము ఉండదు.

    అట్టి అన్యజనులు తమోగుణులై కఠిన హృదయము కలిగినవారుగా ఉందురు. వారికి దయ, కరుణకు బదులు స్వార్ధము, అధర్మము, నీచత్వము ఉండును. ఇంద్రియముల సుఖమును, శరీర సౌకర్యమును కోరుచూ, దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా నడచుకొనుచుందురు. వీరు శరీరానుసారులే కాని ఆత్మను ఎరుగరు.