10. వైరాగ్యము

10. వైరాగ్యము

    ప్రసంగిచేయు ప్రసంగములన్నియు వైరాగ్యమును సూచించుచున్నవి.

    ''చీకటి కంటె వెలుగు ఎంత ప్రయోజన కరమో బుద్ధిహీనత కంటె జ్ఞానము అంత ప్రయోజన కరము. జ్ఞానికి కన్నులు తలలో నున్నవి, బుద్ధిహీనుడు చీకటిలో నడచుచున్నాడు. అయినను జ్ఞానులు మృతినొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినొందు విధమట్టిది'' (ప్రసంగి 2:13,14,16). చీకటి అజ్ఞానమునకు సంకేతము. వెలుగు జ్ఞానమునకు ప్రతీక. బుద్ధిహీనుడు చీకటిలో నడచుట యనగా సాతానుకు లోబడు అన్యజనులు. వీరికి మరణము తప్పదు. జ్ఞానికి కన్నులు తలలో నుండుట అనగా  జ్ఞాన నేత్రము అని అర్థము. కాని అజ్ఞానులైనను, జ్ఞానులైనను మృతి నొందు విధము ఒక్కటియే. అయినను జ్ఞానులు మృతినొందినను, తిరిగి మరణమునకు తీర్చ బడరు. ధనికుడైనను, పేదయైనను, బుద్ధిహీనుడైనను , వివేకవంతుడైనను మరణమందు ఒక్కటే. ఎందుకనగా ఇవన్నియు శరీరాను సారమే. కాని వివేక వంతుడు జ్ఞానము కలుగుట వలన మరల మరణమునకు రాకుండునట్లు తీర్పునుండి తప్పించుకొనుటకు ఆత్మానుసారముగా నడచు కొనును.

    ఇంకను మనుష్యులు వారు సంపాదించుకొనిన ధనమును లోభత్వముతో దాచుకొందురుగాని వారు అనుభవించక మిగిల్చిన దానిని లెక్కగా చూచుకొని మురిసిపోవు చుందురు. కొందరైతే ఙభార్యాబిడ్డలకై వెచ్చించి సంతోషించుచుందురు. మరి కొందరు అనారోగ్యము వలనను ఆహార వ్యవహారములలోను పరిమిత పరచ బడుదురు. అందు వలన వారి సంపదను వారు అనుభవింప లేరు. చివరకు మరణమును తప్పించు కొన లేరు. కనుక అంతయు ఈ భూమిపై విడచి వెళ్శిపోవుదురు. పిదప తన ధనమును ఎవరు ఏ విధముగా  ననుభవించిరో లేక వ్యర్ధము చేసిరో తెలియదు.  ''ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకొనినచో అతని కేమి ప్రయోజనము.'' (మత్తయి 16:2). కనుక ధనాపేక్షయు, భార్య యందపేక్షయు, పుత్రులయందపేక్షయు వ్యర్ధము. ఎందుకనగా యివన్నియు శరీరానుసారమైనందు వలన సుఖదు:ఖములును మరణమును కలిగించును.

    ''పయాసపడి చేసిన పనులన్నింటిని నా తరువాత వచ్చువానికి నేను విడచి పెట్టవలెనని తెలిసికొని నేను వాటియందు అసహ్యపడితిని. నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడచినవాడనైతిని. ఒకడు జ్ఞానముతోను, తెలివితోను, యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును, అయితే దానికొరకు ప్రయాసపడని వానికి అతడు స్వాస్త్యముగా దానిని ఇచ్చి వేయ వలసి వచ్చును. ఇదియు వ్యర్థమును, గొప్ప చెడుగునై ఉన్నది. వాడు తల పెట్టు కార్యములన్నింటి చేతను, వానికేమి దొరకుచున్నది?  వాని దినములన్నియు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు, రాత్రి యందైనను వాని మనస్సుకు నెమ్మది దొరకదు. ఇదియు వ్యర్థమే. దైవ దృష్టికి మంచి వానిగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడైన వానికిచ్చుటకై ప్రయాస పడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్ధము''(ప్రసంగి 2:18,21,22,23,26). కఠిన శ్రమతోను, అత్యాసతోను సంపాదించు ధనమును, ఆస్తులను తన కొరకు కాక మమకార వ్యామోహములతో వారసులకైనను, మోసగించు వారికొరకైనను, వ్యాజ్యములకైనను, వ్యసనములకైనను వెచ్చించును. ఇట్లు విచారించగా తను శ్రమపడినదంతయు వ్యర్థమని తేలును. తన నిర్ణయముగా కాక, దైవ నిర్ణయముగా జరుగునని తెలిసి వైరాగ్యము నొందును.

    ''ప్రతి దానికి సమయము కలదు, ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, చంపుటకు బాగు చేయుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దు:ఖించుటకు, నాట్యమాడుటకు వెదకుటకు, పోగొట్టు కొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు, మౌనముగా ఉండుటకు మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు సమాధాన పడుటకు దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమునందుంచి యున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు. కావున సంతోషముగా (ఆత్మానుసారముగా) జీవితమును వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదు. (ప్రసంగి 3:1,11,12)

    ఎందుకనగా ''ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతించకుడి. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకుడి. అప్పుడవన్నియు మీకును అనుగ్రహించ బడును. రేపటిని గూర్చి చింతింపకుడి.'' (మత్తయి 6:31 - 34).

    ఆయన రాజ్యము అనగా పరలోక రాజ్యము. దానిని ఆయన ''నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు'' అని చెప్పెను. కనుక మనము లోక సంబంధమైన వాటి కొరకై ప్రయాస పడుట వ్యర్థము.

    మనుష్యుడు సమయమునకు లోబడి తన లోక సంబంధమైన మంచి చెడుల ఫలితమును తన జీవిత కాలములో అనుభవించును. ఆ ఫలితము యెట్టిదై ఉన్నదో తెలియనందున, తాను కోరిన దానికి తక్కువగా లభించుటయో, వ్యతిరేకముగా లభించుటయో జరుగుచుండును. అందు వలన దు:ఖము కలుగు చుండును. మనకున్న అంచనాలు గాని, ఊహగాని దైవనిర్ణయము యేమై ఉన్నదో తెలుప జాలవు. కావున యే కాలమందు యేది ప్రాప్తించిన, దానితో తృప్తి పడి సుఖముగా ఉండవలెను. ప్రాప్తించని దాని కొరకు కలవర పడక ఉండవలెను. ఎందుకనగా ప్రాప్తి యింతకు ముందు మనము  చేసిన లోక సంబంధమైన మంచి పనులకు అనుగుణముగా ఉండును. గతములోని క్రియలను మనము మార్చలేము కనుక, ఫలితములను అనుభవించక తప్పదు. కాని ముందు జరగబోవు దానికి, యిప్పుడు మంచి క్రియలు చేయుటకు ప్రయత్నించ వీలగును. చివరగా మరణమును తప్పించుకొనుటకు ఆత్మానుసారముగా క్రీస్తు మార్గమందు నడుచుకొన దగును.

    ''కష్టార్జితము వలన (శాశ్వత) సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానము. దేవుడుచేయు పనులన్నియు శాశ్వతములు. దానికేదియు చేర్చ బడదు. దానినుండి ఏదియు తీయ బడదు.'' (ప్రసంగి 3:13,14) ఎందుకనగా దైవమనగా పూర్ణత్వము. పూర్ణత్వమంటే అంతకంటే ఎక్కువగాని, తక్కువ గాని, రెండవది గాని లేనిది. వాక్యమే పూర్ఱత్వము. వాక్యము దేవుడయ్యెను. దేవుని వలన సమస్తము కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలుగ లేదు. అందు వలన ఏదైనను పూర్ణమే. ఇందులోనుండి తీసివేయ వలసినది ఏదయినా ఉంటే అది కూడా దైవమే. ఏదైనా చేర్చ వలసి ఉన్నచో అదియూ దైవమే. కనుక దైవమును తీసి వేయలేము కదా! అందుకే దైవ కార్యమేదైనను అది శాశ్వతము. దాని నుండి తీసి వేయ వలసినది ఏది ఉండదు. అటులనే చేర్చవలసినది ఏదియు ఉండదు.

    ''సకలజీవులకు ఒక్కటే ప్రాణము. మృగములకంటె నరులకేమియు  ఎక్కువ లేదు. సమస్తమును ఒక్క స్థలమునకే పోవును. సమస్తము మంటిలో నుండి పుట్టెను. సమస్తము మంటికే తిరిగి పోవును'' (ప్రసంగి 3:19,20).

    విశ్వ ప్రాణము ఒక్కటే మనుష్యులకు పంచ ప్రాణములుగా ఉన్నది. మృగములకు కూడా ప్రాణముగా ఉన్నది. అటులనే పంచ భూతములైన ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్విలే నరులకును, మృగములకును శరీరములుగా నున్నవి.. అన్ని దేహములు శుక్ల శోణితముల వలన కలిగినవే. ఈ శుక్ల శోణితములు అన్నము వలనను, అన్నము ఓషధుల వలనను, ఓషధులు పృథ్వి వలనను కలిగినవి. పృథ్వి అనగా మన్నే  కనుక అన్ని జీవులు మన్ను నుండే వచ్చినవి. మరణించిన జీవులు తిరిగి మన్ను నందే కలియు చున్నవి.

    నరుని దేహము పశువుల దేహముల వలె మంటినుండి పుట్టి మంటిలోనె కలియుచున్నవి. నరులు చేయు క్రియలు పాపశరీరమును పుట్టించును కాని , ఆ క్రియలన్నియు మనుష్యుని ఇచ్ఛ బట్టి గాక నరుని పూర్వ క్రియలకు దేవుడిచ్చిన ప్రతిఫలమును బట్టి ఉండును. అజ్ఞానముచే దేవుని నిర్ణయమును తెలియనేరక మరల మరల శరీరానుసార క్రియలు జరుపుకొనుచున్నారు. నరులు తమ  నిర్ఱయమే ననుకొను భావమే శరీరానుసారము. దేవుని నిర్ణయముగా ఎంచుటయే ఆత్మాను సారము. ''ధనము శాశ్వతము కాదు'' (సామెత 27:24). ''ఒక ఒంటరి, కుమారుడును, ఎవరును లేరు, అతనికున్న ఐశ్వర్యము చేత తృప్తి పొందక, సుఖమనునది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నాడని అతడు అనుకొనడు. ఇదంతయు వ్యర్థము, బహుచింత కలిగించును''. (ప్రసంగి 4:8)

    ద్రవ్యమును, ధన సమృద్ధి నపేక్షించువాడు వాటిచే తృప్తి నొందడు. కష్ట జీవులు కొద్దిగా తినినను, ఎక్కువగా సుఖనిద్రను పొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన వృద్ధిచేత నిద్ర పట్టదు.

    ''ఏ ప్రకారముగా తల్లి గర్భమునుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును. తాను ప్రయాసపడి చేసికొనిన దానిలో ఏదయినను చేత పట్టుకొని పోడు. అతడా వచ్చిన ప్రకారము తిరిగి మరల పోవును'' (ప్రసంగి 5:10,12,15). ''ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటె ఒంటె సూది బెజ్జములో  దూరుట సులభము'' (మార్కు 10:25).

    ఒంటెకెన్ని వంకరలో మనుష్యుని బుద్ధికి అన్ని వంకరలు. బుద్ధి దురాశ వలన తనకు అవకాశము ఉన్నదాని కంటే ఎక్కువగా కోరుచూ సన్నని రంధ్రము వంటి అవకాశములో ఒంటె వంటి పెద్దవైన కోరికలను తీర్చుకొన యత్నించును. ఇది అసాధ్యము కదా!   ధనవంతుడు మొదట సంపాదించ వలెనని ఆశ పడిన వాడై, కలిగిన దానితో తృప్తి పడక సంపదను పెంచుకొన తృష్ణతో ప్రయాస పడును. కాని దానిని ఎవరికిని వెచ్చించడు. ఇట్టి లోభి వాంఛా పూరితుడై అక్రమముగా నైనను, దీనత్వముతో యాచించి యైనను ధనమే అన్నింటికి మూలముగా భావించుచు, మరింత శరీరానుసారమై పతనము చెందును. ఇట్టి వారు సాధనా మార్గములో దేవునికి చాలా దూరములో నుందురు.

    ''ఒకడి విషయములో అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును. అయినను దాని ననుభవించుటకు దేవుడు వానికి శక్తి ననుగ్రహించడు. అన్యుడు దానిని అనుభవించును. ఇది వ్యర్ధముగాను , గొప్ప దురవస్తగాను కనపడుచున్నది'' (ప్రసంగి 6:2).

    ఇట్టివన్నియు ప్రాప్తి అనబడును. ఆత్మానుసారముగా జీవించుటను సాధన చేయువారు రాబోవు కాలము గురించి జాగ్రత్త పడుదురు. శరీరానుసారులు మాత్రము వ్యర్థ క్రియల మూలమున అటులనే శ్రమయు, వేదనను పడుచుందురు. వర్తమాన జీవితమును నష్టపోవుదురు.

    కనుక ''సుఖదినమందు సుఖముగా ఉండుము.. ఆపద్దినమందు యోచింపుము.  తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసికొనకుండు నట్లు దేవుడు సుఖదు:ఖములను జత పరచి యున్నాడు. దేవుడు నరులను యదార్ధవంతులుగా పుట్టించెను. గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని యున్నారు. నరులు కల్పించుకొనిన దు:ఖమునకు హేతువేదోగాని , దేవుని సృష్టి అట్లు గాదు''(ప్రసంగి 7:14,29). ''దేవుడు సృష్టించిన ప్రతి వస్తువునూ మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన యెడల ఏదియు నిషేధింప తగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలన, ప్రార్థన వలన పవిత్ర పరచ బడుచున్నది'' (1తిమోతి 4:4-5).

    ''మన్నయినది వెనుకటి వలెనె మరల భూమికి చేరును. ఆత్మ దానిని దయ చేసిన దేవుని యొద్దకు మరల పోవును. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియకును  అది మంచిదేగాని , చెడ్డదేగాని తీర్పులోనికి తెచ్చును.'' (ప్రసంగి 12:7,14). శరీరమే మన్నుతో తయారయినది, కనుక ఆ శరీరము మన్ను లోనె కలిసిపోవుచున్నది. ఆత్మ ఎప్పటికైనను దానిని దయ చేసిన దేవుని ఆత్మలో కలిసిపోవును. శరీర విషయముగా చూచి నట్లయినచో అది శరీరమైనట్టి మీకు అశాశ్వతమనిపించును. ''రేపేమి సంభవించునో మీకు తెలియదు.  మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనె మాయమగు ఆవిరి వంటివారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది, అది చేతుమని చెప్పుకొన వలెను. మీరు డంబముల యందు అతిశయ పడుచున్నారు. ఇట్టి అతిశయము చెడ్డది. కాబట్టి మేలైనది చేయ నెరిగియు  ఆలాగున చేయని వానికి పాపము కలుగును'' (యాకోబు 4:14-17).

    కనుక శరీరాశయు, అత్యాసయు, దురాశయు తీర్పులోనికి తెచ్చును గాన ధనాపేక్ష లేక, అతిశయ పడక, ఆత్మానుసారముగా జీవించ వలెను. భూమి మీద ఉన్నవాటియందు వైరాగ్యము పొంది త్యాగముతో విడచుచు, శాంతి కొరకు ప్రయత్నించ వలెను. ప్రభువు నిర్ణయములే శాశ్వతములనియు, మంచి వనియు తలిచి ప్రార్థనతో కృతజ్ఞతా స్తుతులతో ప్రాప్తించిన వానిని స్వీకరించి తృప్తి నొంద వలెను. వివేచనతో , వివేకముతో జ్ఞానము కొరకు యత్నించ వలెను.

    మనుష్యులు అజ్ఞానములో తిరుగుచు, సాతానుకు లోబడి యుండి దు:ఖములో పడుటయా మరియు మరణించుచుండటయా లేక పరలోక రాజ్యమందు శాశ్వతముగాను, ఆనందముగాను స్థిర నివాసము నొందుటయా యని ఒక తీర్మానము చేసుకొను సమయమాసన్నమయినది. పరలోక రాజ్యనివాసము కోరు వారు సాధకులు. వీరు ముందుగా ఆత్మానుసారముగావలెను. పిమ్మట     అట్టి ఆత్మానుసారులు హృదయ పూర్వక విశ్వాసులగుటకు ప్రవచనము హృదయమునందు  విన వలెను. క్రీస్తు బోధను విస్తరించుటకు ఆయన అపొస్తలులను నియమించెను. వారు సంఘములను ఏర్పరచి, బోధకులకు శిక్షణ యిచ్చి వారికి సువార్తలనందించుచు వారిని  పరిచర్య కొరకు నియమించెను.

తత్త్వం

  చంచలంబగు జగతి లోపల శాశ్వతంబొకటేదిరా

  కనులు మూసి తెరచునంతనే కలిమి లేములు మారురా ||

 1. మాయ లోకంబురా ఇది మనసునాకర్షించురా

    నీది నాది యనుచు నరుడా వాదులాడ బోకురా ||చం||

 2. బంక మట్టి దేహము యిది మంటిలోనే కలియురా

    ఆలు బిడ్డలు బంధు మిత్రులు అందరూ నిను విడచురా ||చం||

 3. ఉంది లేదు అనెడి భేదము దేహముండు వరకురా

    ఈ కట్టె మట్టిలో కలిసినాక ఎట్టి భేదము లేదురా ||చం||

 4. వాక్యమర్మము నెరుగరా మరి తప్పు మార్గము బోకురా

    ఆత్మ యొక్కటే చావు లేక అంతటా వెలుగొందురా ||చం||

తత్త్వం

ఉన్నది ఒకటే సత్యమురా, అది ఎన్నటికీ నశియించదురా

విన్నది కన్నది ఎన్నటికైనా సున్నా చుట్టుకు పోవును రా, అది సున్నా చుట్టుకు పోవును రా ||ఉ||

1. ఆయువు స్థిరమని నమ్మకురా, అది కాలములో గతియించునురా

   దేహ భావన అణచి వేయక ఆత్మ తత్త్వము తెలియదురా ||ఉ||



2. అవివేకము, అజ్ఞానము రా , అది మనస్సును బంధించునురా

   మనోబుద్ధుల చిక్కు తీయక విశ్వాసము నీలో  పుట్టదురా ||ఉ||

3. అహంకారమే మరణ హేతువు, ఎవ్వరికైనా తప్పదురా

   అహంకారమును అణచి వేసిన క్రీస్తు స్థితి సిద్ధించునురా ||ఉ||

4. యేసే దైవము నమ్ముమురా, విశ్వాసమె రక్షణ మార్గమురా

   యేసు లేకను ఎంతటి వారికి పరిశుద్ధ తత్వము తెలియదురా ||ఉ||

5. క్రీస్తే యేసని నమ్ముమురా, ఆ యేసే క్రీస్తని తెలియుమురా

   ప్రభువు ద్వారానే తండ్రిని చేరుట తప్పని సరియని వాక్యమురా ||ఉ||

తత్త్వం

వస్తా ఉత్తదీ, పోతా ఉత్తదీ ఆశలెందుకే ఓ జీవా

మంచి చేసినా, చెడ్డ చేసినా తీర్పు తప్పదే ఓ జీవా ||వ||

1. పంచ భూతములు, సప్త ధాతువులు ఇంతే దేహము ఓ జీవా

   ఉండీ, పుట్టీ, పెరిగీ, మారీ, కృశించి పోవునే ఓ జీవా ||వ||

2. పంచ ప్రాణములు, ఉపవాయువులు ఇంతే ప్రాణము ఓ జీవా

   ఉన్న ప్రాణములు వీడి పోయిన నీ వెవ్వరివే ఓ జీవా ||వ||

3. పంచ కోశములు, మూడు శరీరములు నీవు కాదు కదా ఓ జీవా

   ఇవి నిజమేనని భ్రమసి చేసేవు పాపక్రియలు ఓ జీవా ||వ||

4. ఐదైదులును వాని క్రియలును నీవు కాదు కదా ఓ జీవా

   బుద్ధి హీనమై, సాతాను మాయకు లోబడ బోకే ఓ జీవా ||వ||

5. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమె ఓ జీవా

   ప్రభువు ప్రేమను, ప్రభువు బోధను విశ్వసించవే ఓ జీవా ||వ||

6. క్రీస్తు మరణము, పునరుత్థానము ఆమోదించవె ఓ జీవా

   విశ్వాసముతో, సాదృశ్యముగా ఐక్యత నొందవే ఓ జీవా ||వ||

7. క్రీస్తే యేసని, యేసే తండ్రని జ్ఞానము నొందవె ఓ జీవా

   పరిశుద్ధాత్మ త్రిత్వము తెలిసి రక్షణ పొందవె ఓ జీవా ||వ||