9. శరీరము - ఆత్మ

9. శరీరము - ఆత్మ

    సత్యము, మార్గము , పరిశుద్ధాత్మ , పరలోక రాజ్య నివాసముల గురించి తెలిసి కొంటిమి. తండ్రి, యేసుప్రభువుల సత్య స్వరూపము, మహిమల గురించి తెలిసినది. ఇక  ఆయన జననము, జీవనము, మరణము, పునరుద్ధానములలో మనము ఐక్య పరచు కొనుటకు, సాధకులమైనట్టి మనము జీవించ వలసిన సాధన తెలియ వలెను. సత్యము, మార్గము, నిత్యజీవములనగా తెలిసినవిగాని విశ్వాసికి అవి క్రియా మూలమైనవి. ఆ తెలిసిన దానిని ఆచరణలో పెట్టినగాని  అది హృదయ పూర్వక విశ్వాసము కాదు. హృదయపూర్వక విశ్వాసము కలిగినగాని క్రీస్తుగా మారి, ఆయన యందు ప్రవేశింప వీలుకాదు. ఇందుకొరకు శరీరాత్మల గురించి వివరముగా తెలిసినచో ఆత్మగా సత్క్రియలు జరుపవీలగును. ఆత్మయే దైవము. మనలో గల ఆత్మయే ఆంతర్య పురుషుడు.  బాహ్య పురుషుడుగా నున్న దేహమే దేవాలయము. ఇందుకు వాక్యమేమనగా '' మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు.'' (1కొరింథి 3:16) మరియు ''దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది. మీరు ఆలయమై యున్నారు.'' (1కొరింథి 3:17). ''ఆత్మయే జీవింప చేయుచున్నది కనుక శరీరము అనిత్యము'' (యోహాను 6:63)

     ఆత్మ సత్తా వలన దేవ దూతలును, దేవ దూతల సత్తా వలన ఇంద్రియములును పని చేయు చున్నవి. ఆత్మ సత్తా ఎల్లప్పుడును ఉన్నది. ఇంద్రియముల వ్యవహారము ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది గాను , మరియు దాని వలన సుఖదు:ఖానుభవములు కూడా ఉన్నవి. అవి  ఎక్కువ తక్కువలుగాను వచ్చి పోయేవిగాను ఉన్నవి. అటులనే యీ దేహము ఒకప్పుడు లేకనే గర్భములో కొంతకాలము ఉండి, తరువాత పుట్టి, పెరిగి, బాల్య యవ్వన, వృద్థాప్యములుగా మారుచు, క్షీణించి, నశించు చున్నది. కనుక శరీర ఇంద్రియములు, వాని వ్యాపారములు అనిత్యము కాని ఆత్మ నిత్యము.

    శరీరము మానవ నిర్మిత గుడారము. ఆత్మ దేవునిచే నిర్మించ బడిన శాశ్వత నివాసము. భూమి మీద ''మన గుడారమైన యీ నివాసము శిథిలమై పోయినను (నరుని) చేతి పనికాక, దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకున్నది.'' (2కొరింథి 5:1)

    ఆత్మయే నేను. అది శరీరమను వస్త్రమును ధరించి యున్నట్లు తెలియు చున్నది. కనుక శరీరములేని ఆత్మ దిగంబరము . దిగంబరాత్మయే సత్యము. మనము దిగంబరులముకాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము, అనగా శరీర ధారులుగా నున్నాము. ''కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపై (దిగంబర ఆత్మపై) ధరించుకొన ఆపేక్షించుచు దీనిలో (శరీరములో) మూల్గుచున్నాము.'' (2కొరింథి 5:2) నిత్యమైన పరలోక నివాసము ధరించుటకు గాను, యీ శరీరాత్మ దిగంబరాత్మగావలెను. శరీరమే నేననుచు స్వనీతికి తగినట్లు అవయవ(ఇంద్రియ) క్రియలు జరిపి నట్లయితే, మరణమునకు తీర్పు తీర్చబడును. అందు వలన  శరీరము ఆత్మను కప్పియుంచుచునే ఉండును. కనుక శాశ్వత తత్త్వమైన దిగంబరాత్మనే నేను అను అనుభవముతో సత్క్రియల మూలముగా, ఆత్మానుసారము జీవించిన యెడల మరణమునుండి తప్పించ బడుటచే, ఆత్మ దిగంబరముగా ప్రతిష్ఠితమగును. మృతమైన శరీరము తీర్పు అనుసారము గా మరల మరల తన దుష్క్రియలకు ప్రతిఫలముగా వచ్చుచు, మరణించుచుండును. కనుక ఆత్మ దిగంబర మగుట యనగా తీర్పు నుండి తప్పించ బడుట ద్వారా నిత్యజీవము నొందుట. శరీరమందున్న ఆత్మ యనగా ఆంతర్య పురుషుడు, శరీరమనగా బాహ్య పురుషుడు.

     బాహ్య పురుషుడనగా బయట ప్రపంచముతో సంబంధము పెట్టుకొనిన నేను. ఆంతర్య పురుషుడనగా బయటి విషయముల యెడ రాగ ద్వేషములు లేకను, ఇంద్రియ సుఖములకు లోబడకను, శరీరమును నేను కాదు అన్నట్లుండి అంతరాత్మగా మాత్రమే నున్నవాడు. యదార్థముగా ఆంతర్య పురుషుడే ఆత్మ. బాహ్య పురుషుడనగా స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహమను మూడు దేహములతో కూడి ఉన్నవాడు.

    స్థూల దేహమనగా రక్తము, మాంసము , ఎముకలు, మూలిగ, చర్మము, రసము, మొదడు అను ఏడు ధాతువులతో కూడి, సూక్ష్మ దేహము లేనిదే చచ్చి నట్లు పడి ఉండునది.  సూక్ష్మ దేహమనగా అంత:కరణము(4), పంచ ప్రాణములు (5), పంచ జ్ఞానేంద్రియములు(5), పంచ కర్మేంద్రియముల (5) తో కూడినది. ఈ 19 తత్వముల వ్యవహారమే సూక్ష్మ దేహ వ్యవహారము. కారణ దేహమనగా, పూర్వ కర్మల ఫలితముగా మంచి చెడుల ఫలితముల యొక్క అనుభవమునకును, మరణమునకును చెట్టుకు విత్తనమువలె  కారణమైనది. ఇది పాపము. ఇదియే (గర్భమును ధరించి) అంకురించి మనుష్యుని పాపిగా పుట్టించును.

    ఇట్టి బాహ్య పురుషుడు గర్భస్తమై పుట్టుట, బాల్య యవ్వనములలో పెరుగుచు,  మార్పు చెందుట, వృద్ధాప్యములో కృశించి మరణముతో నశించుట యను అవస్థలను పొందును.

      ''బాహ్య పురుషుడు కృశించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు'' (2కొరింథి 4:16).

    తాత్కాలికముగా డేరా వేయుచు తీయుచు మరొక చోటికి తరలించుచు నాటకములు ఆడుచున్నట్లు, ఈ డేరావంటి శరీరము ఆత్మను కప్పుచు, క్రియలు జరుపుచు, శ్రమయు వేదనయు  పొందుచు, మృతమగుచున్నది. కాని దిగంబర ఆత్మ దినదినము నూతన పరచ బడుట వలన ఇది నిత్యజీవము. అయినను ఆత్మ అదృశ్యము, శరీరము దృశ్యము. కావున ''దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు'' (2కొరింథి 4:18) అని ఎరుగవలెను.

    ''మర్త్యమైనది జీవము చేత మ్రింగి వేయబడునట్లు, ఆ నివాసము దీనిపై ధరించు కొనగోరుచున్నాము'' (2కొరింథి 5:4). పరిశుద్ధాత్మను ధరించుటకు  ఆత్మ మర్త్యమైన శరీరమునుండి విమోచనము కావలెను. ఇదియే జీవము చేత మర్త్యమైనది మ్రింగివవేయ బడుట. శరీరము సత్యమను భావము అజ్ఞానము. ఆత్మ నేను మరియు నిత్యము అనునది జ్ఞానము. కనుక భావన మారి జ్ఞానము కలిగినచో, అది  అజ్ఞానమును మ్రింగి వేయును.  ఎట్లనగా జ్ఞానమను  వెలుగు అజ్ఞానమను చీకటిని మ్రింగివేసినట్లు. ''దీని నిమిత్తము మనలను సిద్థ పరచినవాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచ కరువును మనకు అనుగ్రహించి యున్నాడు. వెలి చూపుల వలన కాక విశ్వాసము వలననే నడచుకొను చున్నాము'' (2కొరింథి 5:5,6). సంసిద్ధులమైనచో   ఆ సంచరువు మనలను పరిశుద్దాత్మగా అభిషేకించును. వెలిచూపు అనగా శరీరానుసారము, విశ్వాసమనగా ఆత్మానుసారము. ఆత్మానుసారులు సంసిద్దులగుటకు అది హృదయ పూర్వక విశ్వాసము కావలెను. వెలి చూపు వలన అసత్యమైన ఈ దేహము  సత్యమని అనిపించును. కాని  ''ఈ దేహమును విడచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము'' (2కొరింథి 5:8). వెలిచూపు మారి అంతర్ముఖమైనచో ఆత్మానుభవము నొందుదుము..

    దీనికి నాలుగు విధములైన సాధనములు గలవు. అందులో  ఈ నిత్యానిత్య వివేకము మొదటిది. నా యందును, జగత్తు యందును ఈ విచారణ చేసినచో ఆత్మ నిత్యమని తేలు చున్నది. స్థూల, సూక్ష్మ, కారణ దేహములు అనిత్యములని తేలు చున్నది. అటులనే మెలకువలో అనిత్యమైన అనుభవములు (సుఖ దు:ఖములు) వచ్చుచు, పోవుచున్నవి. స్వప్నములో కూడా అసత్యమైన అనుభవములు కలిగి, మెలకువలో అవి లేనివిగా తెలియబడుచున్నవి. గాఢ నిద్ర యందు ఏమి తెలియని స్థితి ప్రతి దినము వచ్చి పోవు చున్నది.  ఈ మూడు అవస్థలు అనిత్యము. ఈ మూడు అవస్థలకు సాక్షిగా నున్న ఆత్మ మనకు కల విషయమును, నిద్రానుభవమును, మెలకువ వచ్చినపుడు జ్ఞప్తికి తెచ్చు చున్నది. అనగా ఆత్మ అన్ని అవస్థలలోను ఉన్నదనియు, అది లేని సమయము లేదని ఋజువగుచున్నందున ఆత్మ నిత్యము.

    అన్నము వలన పురుషులందు శుక్లమై, స్త్రీలందు శోణితమై వాటి వలన శరీరము పుట్టి, అది అన్నముతోనే పోషించ బడుచున్నది. అన్నము లేనిచో కృశించి నశించి పోవుచున్నట్టి యీ శరీరమును అన్నమయ కోశమందురు. ఇది మారుచు చివరికి నశించు చున్నందున  అనిత్యము కనుక నిత్యమైన ఆత్మ ఈ శరీరము కాదు. దీని ధర్మములు చావు పుట్టుకలు.

    అట్లే ప్రాణమునకు రాక పోకలును, ఉన్న చోటనే చలనము ఉన్నందున ఇది పరిమితము, అనిత్యము. మనస్సు వాయు రూపమున ఉన్నది కనుక చంచలము అందు వలన అనిత్యము. బుద్ధి యందు నిర్ణయములు కలిగి జ్ఞాపకముల ననుసరించి  మారుచుండును. బుద్ధితో ధ్యానము చేయుదురు, దేవుని ప్రతిష్ఠించుకొని ధారణచేయుదురు మరియు నిశ్చల మనస్సుతో  సమాధి నొందుదురు. ఇవన్నియు బుద్ధి యొక్క అనిత్యమైన స్థితులు. . చిత్తము యొక్క  బీజ స్థితి యందు  మూర్ఛ, నిద్రలు ఉండును గావున ఇది పరిమితము, అసత్యము. ప్రియ, మోద, ప్రమోదము అనెడి లోక సంబంధమైపన విషయముల యందు ప్రీతి లేక వృత్తి బీజములైన ఆనందము కూడా పరిమితము,  అనిత్యము.  ఈ విధముగా విచారించి చూచిన నేను అన్నం, ప్రాణం, మనస్పు,బుద్ధి, ఆనందమయములైన పంచకోశములు కాదు, మూడు శరీరములు కాదు. అందు వలన  పరిమితమైన అనిత్యమైన బాహ్య పురుషుడను కూడా కాదు. నిత్యమై సత్యమై యున్న, సర్వ వ్యాపకమై యున్న ఆంతర్య పురుషుడను నేను అని గ్రహించ బడుచున్నది.

    అయినను శారీరక, మానసిక బాధలు నన్ను ఆత్మగా నిశ్చయించనీయక అజ్ఞానములోనికి లాగుచున్నవి. కనుక ఈ బాధలను వైరాగ్యముతో అధిగమించ వలెను. ముందుగా ఇంద్రియములను శమింపజేసి నిగ్రహించవలెను. మనస్సును నిదానింప జేయవలెను. బుద్ధిని విశ్వాస బలముతో దేవుని చిత్తమునకు లోబడునట్లు చేయ వలెను. ఈ విధముగా  సుఖ దు:ఖములందు చలింపక సమముగా నుండ వలెను. దీని కొరకు ప్రభువునందును క్రీస్తు మార్గమునందును, దైవీ ప్రేమ యందును శ్రద్ధ విశ్వాసములనుంచ వలెను. శ్రద్ధయనగా దేవునియందును, దేవుని వాక్యమందును విశ్వాముండుట మరియు అపొస్తలుల ప్రవచనముల యందు ఆసక్తి కలిగి యుండుట. ఆయన పై భక్తి ప్రేమలతో నుండ వలెను. అన్ని పనులును దైవము చేత, దేవ దూతల ప్రేరణ వలన జరుగుచున్నవి గాన, తాను దేనికిని కర్త కాదని యెంచు చుండ వలెను. కనుక తను జరుపు క్రియల ఫలితములు తనవి గాదని యెరిగి ఎట్టి ఫలితమును ఆశింపక క్రియల జేయు చుండ వలెను. లోక విషయాను రక్తి నుండి మరలి దైవముపై ప్రేమానురక్తి కలిగి యుండ వలెను. అనగా దైవార్పణగా వ్యవహరించ వలెను. ఈ సాధన వలన తన క్రియా ఫలితముల యందు సమత్వమును పొందును. కావున సుఖ దు:ఖముల నొందడు.  ఇందులకు కావలసిన శ్రద్ధతో దైవమును నెరిగి, దైవమందు మునిగి, క్రీడించుటయే సమాధానము. ఇందుకు ఓర్పు, సహనము, ప్రేమ, త్యాగము, భక్తి, విశ్వాసము అను సద్గుణములు అత్యంత అవసరము.  వైరాగ్యము కలుగుటచే మనలను మరింతగా బాహ్య పురుషుని నుండి వేరు చేయగలదు. భూలోక సంబంధమైనవి గాని, స్వర్గలోక సంబంధమైనవి గాని అనుభవింప నిశ్చయించినచో అది బాహ్య పురుషుని కర్మగా యేర్పడును. కావున మరణమునకు తీర్పు తీర్చ బడును. అందు వలన బాహ్య పురుషునికి సంబంధించినవియును, లోకమునకు సంబంధించినవియును అనిత్యములని వైరాగ్యముతో విడువ వలెను. అనగా శరీరాపేక్ష, ధనాపేక్ష విడువ వలెను.  ఈ కష్ట తరమైనది సాధించుటకు మనకు వివేకమును , వివేకముతో విచారించిన ఫలితముగా వైరాగ్యమును కలుగ వలెను. అప్పుడు ఈ దేహమును నేను కాదని, క్రీస్తు యేసు నందు ప్రవేశింప గలవారము. ఆమేన్‌||