14. సాధన క్రమము

14. సాధన క్రమము

    ఈ సాధన క్రమమే మరింత వివరముగా ప్రవచనముల ద్వారా తెలుపుచున్నారు.  

    ''భూమి మీద కృప చూపుచు నీతి న్యాయము జరిపించుచున్న యెహోవాను నేనేయని గ్రహించి, నన్ను పరిశీలనగా తెలిసికొనుటను బట్టియే అతిశయించ వలెను. అట్టి వానిలోనే నేనానందించు వాడనని సెలవిచ్చు చున్నాడు'' (యిర్మియా 9:24). దైవము విశ్వాసులలో నున్నట్లుగానే అవిశ్వాసులలో గూడ నివసించి సంచరించును. అవిశ్వాసులలో ఉన్న అపవిత్రత, విశ్వాసులైన వారికి అంటక ఉండవలెను గాని, తండ్రిని అందరిలో దర్శించుటయే విశ్వాసము. ''నేను వారిలో(అవిశ్వాసులలో) నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై ఉందును. వారు నా ప్రజలై ఉందురు. కావున వారి మధ్యనుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడి. మరియు నేను మిమ్మును (విశ్వాసులను) చేర్చుకొందును. మీకు తండ్రినై ఉందును. మీరు నాకుమారులును, కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు'' (2కొరింధి 6:18). అపొస్తలులకైతే బ్రతుకుట క్రీస్తే, శరీరముతో జీవించుటయే వారి ప్రవచన కార్యమునకు ఫల సాధనమని పౌలు చెప్పుచున్నాడు (ఫిలిప్పి 1:21,22). ఇది క్రీస్తు స్థితి చేరిన విశ్వాసికి సూచకము మరియు అట్టి క్రీస్తుగా మారిన విశ్వాసులు క్రీస్తు యేసు నందు చేర్చుకొన బడుదురు. '' క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు, ఆనందమును పొందు నిమిత్తము'' అపొస్తలులు జీవించి యున్నారు (ఫిలిప్పి 1:26). ఆత్మానుసారుడు క్రీస్తుగా మారుటయే అతడు దేవుని వైపుకు తిరుగుట. ''జీవము గల దేవుని వైపుకు తిరుగ వలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము'' (అపొ.కా 14:15). ''విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యదార్ధమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము'' (హెబ్రి 10:22). ''నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును.  విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలు పరచ బడుచున్నది'' (రోమా 1:17). ''అది యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియై ఉన్నది'' (రోమా 3:22). కాబట్టి విశ్వాస మూలమున యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఆయన కృపయందు ప్రవేశించి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.... మనకు అనుగ్రహించ బడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించ బడియున్నది (రోమా 5:1-5).

    మన ''విశ్వాసమును, నిరీక్షణయు దేవుని యందు ఉంచబడియున్నవి. మీరు క్షయ బీజము(నశించు గుణము) నుండి కాక శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము(నశించనిది, చావు పుట్టుకలు లేనిది, మార్పు చెందనిది, ఆద్యంతములు లేనిది) నుండి పుట్టింప బడిన వారు గను నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్ర పరచుకొనిన వారై యుండి, యొకనినొకడు హృదయ  పూర్వకముగాను, మిక్కుటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు. అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.'' (1పేతురు 1:21-24). ఈ వాక్యమే మనకు ప్రకటించ బడిన సువార్త.

    నీకున్న విశ్వాసము దేవుని యెదుట నీ మట్టుకు నీవేయుంచు కొనుము. తాను సమ్మతించిన విషయములలో తనకు తానే తీర్పుతీర్చుకొనువాడు ధన్యుడు. ''క్రీస్తుయేసు నందు దేవుని ఉన్నత పిలుపుకు కలుగు బహుమానమును పొంద వలెనని గురియొద్దకే పరిగెత్తు చున్నాను'' (ఫిలిప్పి 3:14).

    క్రీస్తుగా ప్రతిష్ఠితమై క్రీస్తుయేసు నందు ప్రవేశించిన వారు ప్రభువు నందు చేర్చుకొన బడుదురు. ఆ మీద పరిశుద్ధాత్మచే ధరింప బడుదురు. అట్లు ధరింప బడిన వారు యేసుక్రీస్తు స్వరూపమైన సంచకరువు ముద్రను పొందుదురు. వీరికి యేసు రెండవ రాకడతో పరలోక రాజ్యమందు శాశ్వత నివాసమేర్పడును. దీనికి వాక్యమేమనగా ''నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్దనుండుటకు మిమ్ములను తీసికొని పోవుదును.'' (యోహాను 14:23).





 సాధన క్రమము

1. రక్షణ కోరు వాడు పరిశుద్ధ గ్రంథమును నిత్యము పఠించ వలెను. అందు చెప్పబడినట్టి ఆత్మాను సారమైన క్రియలను ఆచరించుటకు ప్రయత్నించ వలెను మరియు శరీరాను సారమైన క్రియలను విడచుటలో నిగ్రహము, పట్టుదల కలిగి ఉండ వలెను. దివ్య గ్రంథములో సూచించిన కరుణ, ప్రేమతో స్వార్ధమును జయించ వలెను. ఇంద్రియములు కోరు సుఖమునకై ప్రయాస పడరాదు. దుష్ట భావము, దుష్క్రియలు జరుపుటను నివారించుచు, పరులకు మేలు చేయు క్రియలు జరుపు చుండ వలెను.  సాతాను ప్రేరణను గుర్తించుట ద్వారా నిగ్రహమును పాటించ వలెను. దీనికై దేవుని వాక్యమును సహాయముగా స్వీకరించి, దేవుని ఆజ్ఞకు విధేయులు కావలెను. తమోగుణ సంబంధమైన ఆలోచనలను నిగ్రహించ వలెను. రజోగుణ సంబంధమైన ఆలోచనలను, క్రియలను విడ నాడ వలెను. సాత్వికమును, ప్రశాంత మనస్సును, సహనమును, ఓర్పును అలవర్చు కొనవలెను. దైవేచ్ఛకు  లోబడి అన్ని క్రియలను జరుప వలెను. సుఖదు:ఖములు చెందని సమ తూకమైన బుద్ధిని సంపాదించు కొనవలెను.

2.సజ్జనులతో స్నేహము చేయు చుండ వలెను. దేవుని యందు స్ధిరమైన విశ్వాసము కలిగి యుండ వలెను. దయ, ప్రేమ, శాంతి కలిగి యుండి అందరిని సహోదరుల వలె ఆత్మీయముగా భావించ వలెను. సచ్ఛీలత, సదాచారము పెంపొందించు కొన వలెను. శరీరానుసారమైనదేదో తెలిసి మనస్సులోను, భావములోను త్వరితముగా మార్పు తెచ్చు కొన వలెను. స్వార్ధమును నిలుపు చున్నట్టి  అవయవములను, ఇంద్రియములను, మనస్సును భావ శుద్ధి ద్వారా దైవ జనునికి అర్పించి వేసి, దైవ జనుల ఆజ్ఞను అనుసరించి నడచుకొన వలెను. అక్షయుడగు దేవుడు ఒక్కడే యని, రెండవది యేదియు లేదని  ఉండ వలెను. దేవుని వాక్యమునే నిత్యము హృదయమున విన వలెను. వినిని దానిని గ్రహించి వాక్యానుసారముగా జీవించ వలెను.

3. దేవుని వాక్యము దైవ జనులకు స్ఫూర్తి ద్వారా అందించ బడినదని యెరుగ వలెను. దేవుని వాక్యమే ప్రమాణము. వాక్యార్ధమును దైవ శక్తి ద్వారా గ్రహించ వలెను. భాషణమునకును, ప్రవచనమునకు భేదము తెలిసి, సదవగాహన చేసికొన వలెను. విపరీతార్ధమును చేయక, కుతర్కము లాడక సత్యమును గ్రహించుటకు ప్రయత్నిము చేయవలెను. క్రీస్తు నాయందు ఉన్నాడనియు, క్రీస్తు నందు మనమందరము ఉన్నామనియు,  నేనే క్రీస్తు నను పవిత్ర భావముతో నిరంతరము ఉండ వలెను. నా కంతయు తెలుసు నని గర్వము లేక, పెద్దలు, జ్ఞానులు, దైవ జనులు అందించు వాక్యములను శ్రద్ధతో విని, గ్రహించ వలెను. హృదయమున స్ఫూర్తి నాశ్రయించి జీవించ వలెను.

4.అతి నిద్రకు, ఆకలికి లోబడక వివేకముతో చురుకుగా ఉండ వలెను. మితాహారమును, హితాహారమును భుజించ వలెను. వీటి యందలి సూక్ష్తశక్తి ప్రాణముగాను ఆహారమందలి సూక్ష్మ శక్తి మనస్సుగాను వర్తించుచున్నది కావున తినుట కొరకు బ్రతుకరాదు మరియు విషయానందముగా స్వీకరించరాదు.  బ్రతుకుట కొరకే తిన వలెను. సుఖము దు:ఖము, చలి ఎండ వంటి ద్వంద్వముల విషయములో సమత్వముగా ఉండ వలెను. తనకు భాద్యత లేని చోట జోక్యము తగదు మరియు వ్యర్ధ మాటలు , వ్యర్ధ చేతలు నివారించి, మౌనము పాటించ వలెను. ఈ మౌనము మాటలలోనే గాక తలంపులలోను ఉండ వలెను. లోక విషయములలో తటస్థముగాను, ఉదాసీనముగాను ఉండ వలెను. లోకులు నీయందు దోషము లెంచుటలో నీ శీలతను పరిశీలించుకొని నిర్దోషిగా మార వలెను. బాధ్యతలను నిర్వర్తించుటకు తప్ప ఎవరితోను ఎట్టి సంబంధము కొనసాగించ రాదు. భాధ్యత వలన జరుగు పనిలో రాగ ద్వేషములు, అరిషడ్వర్గము, అహంకారము వంటివి లేకుండా చూచుకొన వలెను. అందరిలో కలిసి అన్ని పనులు చేయు చున్నను, మనస్సులో ఒంటరి తనము, అంతరమున సాక్షిగాను

 ఏకాంతమును అనుభవించ వలెను. దైవ జనుల యందును, సజ్జనుల యందును, సత్పురుషుల యందును, క్రీస్తు విశ్వాసుల యందును ప్రీతి కలిగి ఉండ వలెను. దు:ఖ పడుచున్న వారియందును , అజ్ఞానుల యందును, నీచ గుణములు కలవారి యందును కరుణ కలిగి ఉండ వలెను. ప్రభువు యందు భక్తి విశ్వాసములు కలిగి ఉన్నవారి యందును, క్రీస్తు మార్గములో సాధన చేయుచున్న వారి యందును స్నేహ భావము కలిగియుండ వలెను. అన్యజనులందును, అవిశ్వాసుల యందును, దుష్టక్రియలు జరుపు వారి యందును ఉపేక్ష, ఉదాసీనత్వము కలిగి ఉండ వలెను. యౌవ్వనులుగా నున్నప్పుడే సాధన మొదలు పెట్ట వలెను. అప్పుడే వార్ధక్యములో దైవారాధన యందును, దైవములో ప్రతిష్ఠితులగుటకు సాధ్య పడును.

5.ఎవరు నిశ్చల బుద్ధి కలిగి పైన చెప్పబడిన సాధనలు చేయు చుందురో వారు ప్రభువు నందు చేరు జ్ఞానమునకు అధికారులగుదురు. వారు వాక్యమును గ్రహించి, అనుభవములో నుంచు కొందురు. ధర్మ శాస్త్రమునకు అతీతమైన దేవుని నీతి ప్రకారము వారు క్రీస్తు న్యాయ స్థానమందు మరణమునకు తీర్పు తీర్చబడరు మరియు పరలోక రాజ్య నివాసము వారిదే!



 యేసు క్రీస్తు - క్రీస్తు యేసు (పాట)

ఊపిరి కన్నా చేరువటా

ఊహాతీతుడు తానంటా

ఉన్నతులకు ఉన్నతుడంటా

ఉన్నది మాత్రము తానంటా

తానే యేసు ప్రభువూ | తానే యేసు ప్రభువూ ||ఊ||

1. ప్రేమే అతనికి తత్త్వమటా

   ప్రేమించుటకే వచ్చెనటా

   ప్రేమను తిరిగి కోరునటా

   అందుకె మార్గము చూపెనటా

   తానే యేసు ప్రభువూ | తానే యేసు ప్రభువూ  ||ఊ||

2. కన్యక మరియ తనయుడటా

   మార్గము సత్యము జీవమటా

   బోధించుటకే వచ్చెనటా

   తానే రక్షణ మార్గమటా

   తానే  క్రీస్తు యేసూ | తానే  క్రీస్తు యేసూ  ||ఊ||

3. తండ్రిని పోలిన తనయుడటా

   పాలకుడై పాలించునటా

   యేసును నమ్మిన చాలునటా

   అతడే తండ్రిని చేర్చునటా

   తానే యేసు క్రీస్తూ  | తానే యేసు క్రీస్తూ  ||ఊ||

4. నన్నే క్రీస్తుగ మార్చునటా

   క్రీస్తే యేసని తెలుపునటా

   పరిశుద్ధాత్మ త్రిత్వమటా

   వాక్యము, దైవము తానంటా

  తానే  క్రీస్తు యేసూ | తానే యేసు క్రీస్తూ  ||ఊ|