15. ప్రేమ మార్గము
క్రీస్తు యేసు సాదృశ్యములో ఆయన మార్గమైన ఓర్పు, సహనము, ప్రేమ, నిరీక్షణలతో మనము ఆయనతో ఐక్యత పరచుకొన వలెను. అందరిలో ఆయనను దర్శించుటకు, నిజమైన విశ్వాసము మనలో కలుగ వలెను. అయినను ఆ విశ్వాసము మనలో కలుగ వలెననిన ప్రేమ ద్వారా మన హృదయములను విశాల పరచుకొనవలెను, మరియు సంకుచితత్వమును వీడ వలెను.
ఎందుకనగా ''ప్రకృతి సంబంధితమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింప దగును, గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.'' (1కొరింథి 2:14) అందు వలన అతని హృదయము సంకుచితముగా నున్నంత వరకు అతడు వాటిని గ్రహింప నేరడు.
ఇంకను ''ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి, మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరమున్నది,ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెను. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయెను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టిన వాడెట్టి వాడో మంటి నుండి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధి యెట్టి వాడో పరలోక సంబంధులును అట్టి వారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలిక ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము'' (1కొరింథి 15 : 14- 49).
కావున మనకు తెలియుచున్నదేమనగా మంటి నుండి వచ్చిన శరీరమును ధరించి, శరీరమే నేను అనుచున్న మనుష్యుడు, ఆత్మానుసారము జీవించుచు, చివరకు ఆత్మానుభవమునొందుటకు దేవునిచే నియమించ బడెను. ఇది జగత్తుకు పునాది వేయబడక మునుపే ఆయనచే ప్రణాళిక వేయ బడెను. కనుక మనుష్యుడు, తాను పరలోక సంబంధి పోలికయు ధరించుటకు ఆశీర్వదింపబడి యుండెను. దీని కొరకు మనుష్యుడు వ్యక్తిగత శరీరమే నేను అనుభావము వలన కలిగిన స్వార్ధముచే బంధించ బడెను. ఇదియే అతని యొక్క అంత:కరణమును సంకుచిత పరచెను. అతని హృదయము పరిశుద్థము కావలెననిన, అతని సంకుచిత్వము నశించ వలెను. దీనికి క్రీసుయేసు ఏర్పరచిన ప్రేమ మార్గమే శరణ్యము. ప్రేమ వల్లనే స్వార్ధము నశించును. ప్రేమ వల్లనే త్యాగమును, త్యాగము వలన విశాల భావమును కలుగును మరియు హృదయము శుద్ధమై సమిష్టి భావన కలుగును. ఇదియే మనలను సాధారణ ప్రేమ ద్వారా దివ్య ప్రేమకు మార్చి చివరకు దైవమే యగుటకు త్రోవ చూపును.
అందరు దేవుని బిడ్డలమే. అందు వలన మనమందరమును సహాదరులము. క్రీస్తు విషయమై ప్రేమ ద్వారా మనమందరము ఏకమై ఉన్నాము. అందువలన నా వారు ఇతరులు అను భేదముగాని, మిత్రులు, శత్రువులు అను భేదముగాని ఉండరాదు. ఈ యేకత్వ భావమును క్రీస్తు చూపిన ప్రేమ తోనే సాధించ గలము. వ్యక్తిగతమైన భావనను వేరు పరచును, ఆత్మ విషయముగా చూచినచో వ్యక్తిత్వము నశిఙంచి, ప్రేమ కల్గును. ప్రేమలో ఆత్మ అభిషేకింప బడును. అది పరిశుద్ధాత్మగా పరిణమించును. ఇదియే మనకు క్రీస్తు అందించిన ప్రేమ మార్గము.
''సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకరు అనురాగము కలవారై, ఘనత విషయములో ఒకనినొకడు గొప్ఫగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయములో మాంద్యముకాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ కలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు కలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము యిచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి. దీవించుడి గాని శపించ వద్దు. సంతోషించు వారితో సంతోషించుడి. ఒకనితో ఒకడు మనస్సు కలిసి యుండుడి. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుడి. కీడు వలన జయింప బడక మేలు(ప్రేమ) చేత జయించుము.'' (రోమా 12:10-21) ఓర్పుతో ఉగ్రతకు చోటిచ్చిన అన్ని దుష్క్రియలకు (నీవుగాక) ప్రభువే ప్రతిఫలమిచ్చు వాడగును శిక్షించుట క్రీస్తు ప్రేమికుల పని కాదు.
క్రీస్తు ప్రేమికులు శత్రువునైనను శిక్షించ పూనుకొనక మేలునే చేయ వలెను. ''ఎదిరించు వారు తమ మీదకు తామే శిక్ష తెచ్చుకొందురు'' (రోమా 13:2). వారు క్రీస్తు స్థితిలో నుండక తీర్పునకు లోబడుదురు. కనుక ప్రేమయే తీర్పు నుండి రక్షించును. సర్వము తానే అయిన దేవుని యందు మనమున్నాము, మనందరిలో ఆయన ఉన్నాడు. ప్రేమచేత ఆయన సాదృశ్యములో మనలను ఐక్యత పరచుకొనుటయే ప్రేమకు ముఖ్యాంశము. ప్రేమ చేత అంత:కరణ మందున్న సంకుచితత్వము విమోచన పొందును. అప్పుడు హృదయ మందు క్రీస్తు స్థిరమగును. ''క్రీస్తయిన వానికి శరీరమొక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారము మీ పిలుపు విషయమై యొక్కటే నిరీక్షణ యుండుటకు పిలువ బడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మమొక్కటే, అందరికి తండ్రియైన దేవుడొక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై, అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో పతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప యియ్యబడెను.''(ఎఫెసి 4:4-7). కృపా వరమెట్లనిన, అన్యజనులకును, క్రియా మూల విశ్వాసులకును ముందుగా వివేకమునిచ్చును. హృదయ పూర్వక విశ్వాసులకు క్రీస్తు స్థితిని అనుగ్రహించును. క్రీస్తు యేసు నందున్న వానిని పరిశుద్ధ పరచును. పరిశుద్ధాత్మ అయిన వానికి పరలోక రాజ్య నివాసమును అనుగ్రహించును. ఇట్లు సాధన చేయువాని వాని ఆధ్యాత్మిక పరిమాణముల చొప్పున వానికి కృప యియ్యబడును.
''కాబట్టి ఆగ్రహభయముల బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము'' (రోమా 13:5). ఎందుకనగా ఆగ్రహ భయములు శరీరమూలము, మనస్సాక్షి ఆంతర్య పురుషుడుగా సత్క్రియలు జరుపును. మనస్సాక్షి కలవారికి ప్రేమ సహజము. ''అందువలన ఒకనికొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవరికిని అచ్చి ఉండవద్దు. మరి యే ఆజ్ఞ అయినను ఉన్న యెడల అదియు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింప వలెనను వాక్యములో సంక్షేపముగా యిమిడి ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే'' (రోమా 13:8-9).
క్రీస్తైన వాడే నిజమైన ప్రేమ కలిగి యుండును. ఎందుకనగా క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై ఉన్నాడు. ఆ పైన దేవుని నీతిని అందుకొనుటకు ప్రేమ తోడ్పడును. ధర్మశాస్త్రము లౌకికాత్మ సంబంధము. నీతియందుండుట క్రీస్తు సంబంధము. లౌకికాత్మ ప్రేమ స్వార్థ పూరితము, క్రీస్తు ప్రేమ త్యాగమయ మైనది. దేవుడు తన్ను ప్రేమించిన వారికొరకై ఏవి సిద్ధ పరచెనో అవి దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలు పరచి ఉన్నాడు. ''దేవుని వలన మనకు దయ చేయ బడిన వాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము'' (1కొరింధి 2:13).
దేవుని ఆత్మయే అంతటను నిండి ఉన్నది. అందు వలన మనుష్యుల ఆత్మగాఉన్నది కూడా దేవుని ఆత్మయే. దీని మహిమ వలన మనుష్యులందు ఆంతర్య పురుషునిగా, సత్యమును, ప్రేమను, సుఖమును కోరువాడై ఉన్నాడు. కాని ఆంతర్య పురుషుని ప్రబోధ వినక, సాతాను సంబంధమైన అజ్ఞానములో పడి మంచి చెడుల కర్మలు చేయుచు, మరణమునకు సిద్ధ పడుచున్నాడు. మంచి చెడుల ఫలితములున్ను, మరణమున్ను బాహ్య పురుషునికేగాని, ఆత్మకు కాదు. ప్రవచనములన్నియు దీనినే తెలుపుచున్న వాక్యములే. కనుక ''ఆయన వాక్యమును ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి యున్నవాడనని చెప్పుకొను వాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగునే తానును నడుచుకొన బద్దుడై యున్నాడు'' (1యోహాను 2:5-6). ఇదియే ప్రభువైన యేసు క్రీస్తు సాదృశ్యముగా మనము ఐక్య పరచుకొనుచు నడుచుట. నీ ప్రేమ పరిపూర్ణ మెట్లగుననిన, ''నీదేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సు తోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింప వలెననియు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింప వలెననియు వ్రాయ బడియున్నది'' (లూకా 10: 27).
పూర్ణ హృదయమనగా శరీరము వలనను లౌకిక విషయముల వలనను ఉద్వేగము చెందని హృదయము. పూర్ణ మనస్సనగా దుర్నీతి, దుష్క్రియలకు తావులేక మనస్సాక్షిగా నుండు మనస్సు. పూర్ణ శక్తి యనగా ఓర్పు, సహనము, శాంతి, నిరీక్షణలను కలిగి ఆగ్రహ భయములులేని నిగ్రహ శక్తి. పూర్ణ వివేకమనగా ఉగ్రత దినమందు తీర్పునకు కారణమగు దుష్క్రియలకు దూరమై, సత్క్రియలు మాత్రము జరుపుటకు నిశ్చయతనొందిన బుద్ధి, మరియు ప్రభువు నందు విశ్వాసము వలన పక్షపాత బుద్ధి లేక అందరిని ప్రేమతో తనలో ఐక్యత పరచుకొను వివేకము. ప్రేమ ఘనమైనదియు, శ్రేష్ఠమైనదియు కావలెనని ప్రభువు మనలనందరిని ఏకరీతిగా ఎట్లు ప్రేమించెనో, మనమును ఆ రీతిగా పొరుగు వారిని ప్రేమించుటలో ఎక్కువ తక్కువలు ఉండరాదు.
''శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని'' యెహోవా చెప్పెను. (యిర్మియా 31:3). అట్టి ప్రేమ స్వరూపుడైన యెహోవా తండ్రియై తన కుమారుని ప్రేమ మార్గముగా చేసి మన కొరకు పంపెను. కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమ, కరుణలను వ్యక్త పరచి, బోధించి, సాదృశ్య పరచుకొనమని, మనకు మార్గముగా నుండెను. తనను సిలువపై మరణించునట్లు జేసిన వారిని, అవమాన పరచిన వానిని క్షమించ మని తండ్రిని వేడుకొని క్రీస్తు యేసు నిజమైన ప్రేమ అనగా నెట్టిదో నిరూపించినాడు. '' తండ్రీ! వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమింపు'' మనెను (లూకా 23: 34). తండ్రి ప్ర్రేమ, ప్రభువు వెల్లడించిన ప్రేమయు, శ్రేష్ఠమై నట్లే మనమును ప్రేమను వృద్ధి చేసికొన వలెను.
''నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింప వలెను. మీరు ఒకని యెడల ఒకడు ప్రేమింప గలవారైన యెడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలిసికొందురు'' (యోహాను 13:34-35). శిష్యులు వ్యక్త పరచు ప్రేమను అన్యజనులు ఆదర్శముగా తీసికొని, అట్టి ప్రేమలో ప్రభువును దర్శించ గలరు. క్రీస్తు ప్రేమయనిన ఎట్టిదో వీరి వలన అందరును తెలిసికొందురు. ఇదియే క్రీస్తు మార్గము మరియు ప్రేమ మార్గము. దీనిచే హృదయములు తట్ట బడును. పరిశుద్ధాత్మ వారిపై కుమ్మరించ బడును.
దేవుని ప్రేమించుటకు ఏమి చేయ వలెను?
అందరూ ఆత్మీయులే అనగా ఆత్మ సంబంధులేగాని, శరీర సంబంధులైన అన్యజనులు కాదు. శరీరములుగా తాను, పరులు అను భేదముండును గాని, ఆత్మ సంబంధులకు అట్టి భేదము ఉండదు. ఆత్మానుసారులైన వారు ఆ భేదమును ప్రేమ ద్వారా పోగొట్టు కొన వలెను. అదియే దేవుని ప్రేమించి నట్లు. ఈ విధముగా ఏకత్వానుభవమును పొంది క్రీస్తుగా మారుదురు.
1. తోటి మానవుని ప్రేమించుటయే దేవుని ప్రేమించుట.
2. మన ఆత్మీయుల పట్ల మన కెట్టి సద్భావము ఉండునో, పరుల పట్ల కూడా అట్టి సద్భావమున్నచో మనము దేవుని ప్రేమించి నట్లే. (సద్భావమనగా రెండుగా లేని ఏకత్వ భావన).
3.పరులలో దోషములను ఎంచుటకు బదులుగా మనలోని గుణదోషమును పరిశీలించుకొని నివారించు కొనినచో దేవుని ప్రేమించి నట్లే. (గుణ మనగా రజోగుణము, తమో గుణము, సత్వ గుణము).
4.మన సహాయమునకై పరులను దోచుకొనుటకు బదులు, పరుల సహాయమునకై మన స్వార్ధమును దోచి పెట్టినచో ( అనగా త్యాగము చేసినచో ) దేవుని ప్రేమించి నట్లే. (సత్వగుణము).
5.మనకు ప్రాప్తించిన దానిని దేవుని ఇచ్ఛగా అంగీకరించుచూ, ఓర్పుతో సంతృప్తితో, సంతోషముగా నున్నచో దేవుని ప్రేమించి నట్లే. (విషయ సమత్వము).
6. పరుల కష్టసుఖములను తన కష్ట సుఖములుగ భావించుచు, చేయ వలసిన సహాయమును చేయుచూ, సంతోషముగా నున్నచో దేవుని ప్రేమించి నట్లే. (శుద్ధ సత్వము).
7.దేవుని సృష్టిలో ఏజీవికైనను హాని చేయక, అన్నిటి యందును, దేవుని ఉనికిని భావించుచున్నచో అదియే భక్తి , అదియే విశ్వాసము, అదియే ఆరాధన. ఇట్లు ఉదయించిన ప్రేమ అనుభూతులున్నచో అది దేవుని ప్రేమించి నట్లే. (ఇట్టి విశ్వాసి క్రీస్తుగా మారును).
మనము దేవుని ప్రేమించ వలసిన రీతిగా ప్రేమించ వలెననినచో పైన పేర్కొనినట్లు నిన్ను నీవు కోల్పోయి, పరులతో నీకున్న భేదమును పోగొట్టుకొన వలెను. మరియు ప్రేమను వ్యక్తి గతము నుండి సమిష్టికి చేర్చి, ఏకత్వానుభూతిని పొంద వలెను. దీని కొరకు నీవు దైవమును ప్రేమించుటయే జీవిత గమ్యమని యెంచి, దేవుని కొరకే .జీవించుచు, దేవుని కొరకే మరణించ వలెను. అప్పుడు మనము క్రీస్తు యేసు నందు ప్రవేశించి(మేల్కొని) పరిశుద్ధాత్మగా నుండెదము.