16. ధైర్యము - శోధన

16. ధైర్యము - శోధన

     ''యేసు మన కొరకు ప్రతిషఙ్ఠంచిన మార్గము, అనగా నూతనమైనదియు, జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా యేర్పరచ బడినదియు నైన మార్గము''  (హెబ్రి 10:19).  దీని ప్రవేశమునకు దైర్యము కలిగి ఉండుము. ''కాబట్టి నీవు దైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన యెడల నీవు ఏ పనిని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడచు కొందువు'' (1రాజులు 2:2-3).

    ధైర్యముతో శోధన చేయ వలెను. శరీర శ్రమలును, మానసిక వేదనలును కలుగుచున్నను, ధైర్యముతో ప్రేమతో సత్క్రియలు జరుప వలెను. శోధన చేయుటకు కావలసిన వివేకము ప్రేమలు ధైర్యము మూలముగా వచ్చును.

    ''దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల యెటువంటి ఖడ్గము కంటె వాడిగా ఉండి, ప్రాణములను, కీళ్ళను, మూలిగను విభజించు నంతమట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది''. (హెబ్రి 4:12).

     దేవుని వాక్యము దేవునికి సూచకము. దేవుడు తాను సృష్టించిన ప్రతి అణువులోను చొచ్చుకొని వ్యాపకమై యున్నాడు. మనుష్యులలో కనుపించు అవయవములలో నుండి, కనిపించని ఇంద్రియములలోనికిని, హృదయములోనికి చొచ్చి వాని తలంపులను, ఆలోచనలను శోధించుచున్నాడు. మనమును యీ జ్ఞానముతో  ప్రేరణ కలిగినచో మనలో గొప్ప శోధన కలుగును. శోధన ఫలితముగా దీర్ఘ శాంతమును పొందెదము. అది ప్రేమమయమై క్రీస్తుగా మార్చును. ఇదియే ఆరాధన.

    ''అట్టి స్వేచ్ఛారాధన విషయములోను దేహ శిక్షణ విషయములోను జ్ఞాన రూపకమైనవని యెంచ బడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయములో ఏ మాత్రము ఎన్నిక చేయదగినవి కావు'' (కొలస్సి 2:23). శరీర విషయములను త్యజించుటకు ధైర్యము కావలెను. అట్టి ధీరునికి సంబంధించిన పూర్వ దుష్క్రియ ఫలితములు చెల్లి పోవును.

    ''వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకముంచు కొననని ప్రభువు చెప్పుచున్నాడు'' (హెబ్రి 10:17).

    ''ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను'' (2కొరింథి 5:17). ''కాబట్టి యిప్పుడు క్రీస్తు యేసు నందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.  క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి విడిపించును'' (రోమా 8:1). ఇదియే తీర్పు నుండి సంపూర్ణ రక్షణ మరియు నిత్యజీవమైన సత్యము.

    క్రీస్తు నందున్నవాడు ఆత్మగా నున్నాడు. ఆత్మానుసార జీవనమునకు గమ్యము ఆత్మగా నుండుటయే. ఇట్టివాడు క్రీస్తు అనబడును. క్రీస్తుగా మారిన వానికి పాతకర్మల వలన కలుగు మంచి చెడుల ఫలితము ఉండదు. ఈ ఫలితమునకు క్రీస్తు న్యాయస్థానమందు తీర్పు తీర్చబడదు. పాతవి గతించినవే. పవిత్రమైనవాడే క్రీస్తైనందున, అట్టి క్రీస్తుది నూతన జన్మ. ఈ రెండవ జన్మ నొందిన వానికి పాపము అంటదు, మరణమునకు తీర్పు తీర్చ బడడు. పాపము వలన కలిగినట్టి శరీర భావము నుండి విముక్తుడైనందున ఇతడు దిగంబరాత్మ. ఇతడు శరీరమును ధరించినను, ధరించని వానితో సమానము, ఎందుకనగా, అతని క్రియలు శరీరానుసారము కాదు.

    ఇట్టి దిగంబరాత్మగా నున్న వాడైననే అతనిపై పరిశుద్ధాత్మ కుమ్మరించ బడును. ఇతడు వెనువెంటనే క్రీస్తుయేసు నందు ప్రవేశించును. నూతన జన్మ వలన క్రీస్తుగా మారిన వాడు చేరు చోటు క్రీస్తు యేసు. తండ్రి నుండి, తండ్రి పోలికన శరీరధారియై వచ్చినవాడు యేసు క్రీస్తు. ఈ రెండును ఒక్కటియే. ఆరోహణ, అవరోహణ మార్గమును బట్టి ఇవి రెండుగా నున్నవి. అనగా తండ్రి నుండి దిగిన స్థితి యేసుక్రీస్తు, మరియు తండ్రి స్థితికి చేర్చుకొన బడిన వాడు క్రీస్తు యేసు. ఈ రెండును ఐక్యత చేయ బడిన స్థితిలో ఒక్కటియే. ఈ విధముగా క్రీస్తుయేసునందు ప్రవేశించిన వానిని యేసు నందు సారూప్య పరచి, చేర్చుకొనును. ఆయన పరిశుద్ధాత్మగానే యున్నాడు. ఇప్పుడు సాధకుడు కూడా పరిశుద్ధ పరచబడినందున, ఈ నూతన జన్మలో పరిశుద్ధాత్మగా మారిన వాడయ్యెను. సాధకుడు ఆయనతో సమానమయ్యెను. ఇద్దరును ఆ ఒక్క పరిశుద్ధాత్మయే.

    ఇదియే ఆయన యొక్క పవిత్ర జననముతోను, జీవముతోను ఐక్యత పరచుకొనుట. సిలువపై మరణించి, పునరుత్థానమైన ''క్రీస్తుయేసు''  ''క్రీస్తు''గా మరణించి ''యేసు''గా పునరుద్ధరించ బడెను. దీని సాదృశ్యముగా సాధకుడు ఆయన సారూప్యమగును.

    కనుక క్రీస్తుగా మరణించిన క్రైస్తవుడు ఇక జన్మించడు. దీనినే మరణము జయించిన క్రీస్తు అందురు. క్రీస్తుగా '' ఒకే జన్మ, ఒకే మరణము''.

    పరిశుద్ధాత్మ అయిన సాధకుడు సంచకరువు అను ముద్రను పొంది, ఆయన రెండవ రాకడలో పరలోక రాజ్యమందు స్థిరమగును.





శోధన

1. నిజమైన అస్థిత్వము :- దేవుడు ఒక్కడే ఉనికి కలిగి యున్నాడు. అనంతుడు, శాశ్వతుడు, నిత్యుడు, సత్యము, పరిశుద్ధుడు అయి ఉన్నాడు. రెండవది ఏదియు లేక ఒక్కటిగా నున్నది దేవుడు ఒక్కడే. ఇదే నిజమైన అస్ధిత్వము.

2. నిజమైన ప్రేమ :- అందరిలోను, అన్నింటిలోను నివసించి యున్న అనంతమైన ఆ దేవుని తెలిసి కోవాలనియు, ఆయనలో ఏకత్వము పొందాలనియు తపన పడుటయే నిజమైన ప్రేమ.

3. నిజమైన త్యాగము:- ప్రేమించడ మంటే ఏదైనా పొందుట కొరకు కాదు. ప్రేమ కొరకు సర్వము అర్పించుటయే ప్రేమ. అందు వలన దేవుని ప్రేమించుట అనగా మన శరీరము, ప్రాణము, మనస్సు, అధికారము, ఆరోగ్యము, తుదకు జీవిత సర్వస్వము త్యాగము చేయుటయే. అదియే నిజమైన త్యాగము.

4. నిజమైన పరిత్యాగము:- నేను మాత్రముండి పై విధముగా చేసినదే త్యాగము. కాని నేను సహితము లేకుండా పోయి, దేవునిలో కరిగి పోవుట నిజమైన పరిత్యాగము.

5. నిజమైన జ్ఞానము:- సర్వ వ్యాపకమైన దేవుడు మంచి వారి యందును, చెడ్డ వారి యందును, సర్వజీవుల యందు ఉనికి కలిగియు, ఏకత్వముగా ఉన్నాడని అనుభవించు జ్ఞానమే నిజమైన జ్ఞానము.

6. నిజమైన నిగ్రహము:-  శరీరానుసారమైన వన్నియు సాతాను సంబంధమైనవని యెంచి, చలించక, ఆత్మానుసారముగా జీవించుటయే నిజమైన నిగ్రహము.

7. నిజమైన సర్వార్పణ:- సాతాను వలన కలిగిన ఎట్టి విపత్తులలో నైనను, మనస్సును చలింపనీయక, మనస్సును సమతూకములో నుంచుచు, దేవుని ఇచ్ఛను ఎదిరించని విశ్వాసముతో ఎల్లప్పుడును  సంతోషముగా నుండుచు, ఇంకనూ దేవుని ప్రేమించు చుండుటను విడువనిదే నిజమైన సర్వార్పణ