18. కొండ మీద ప్రసంగము

18. కొండ మీద ప్రసంగము

    ''యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు  ప్రజలలోని ప్రతివ్యాధిని, రోగమును స్వస్ధపరచుచు గలిలయ యందంతట సంచరించెను. ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను,  పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యము పట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు  తీసికొని రాగా ఆయన వారిని స్వస్ధపరచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేేము, యూదయయను ప్రదేశముల నుండియు యోర్దానునకు అవతలనుండియు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను.''

  అర్ధముః 

సమాజ మందిరమనగా ఇంద్రియములతో కూడిన దేహము. మందిరములలో బోధించుట అనగా పరిశుద్థ పరచబడిన హృదయములందు నాటుకొనునట్లు బోధించుట. దేవునిరాజ్యమనగా సర్వవ్యాపకమైన  పరిశుద్ధాత్మ. సువార్తయనగా దేవునివాక్యము. వాక్యమే దేవుడు కనుక, సువార్తను ప్రకటించుటయనగా దేవుని ప్రతిష్టించుకొనుట. వ్యాధి అనగా సాతాను ప్రేరణకులోబడుట. రోగమనగా దాని వలన కలిగిన మంచి  చెడులకును, మరణమునకు తీర్పు తెచ్చుకొనుట. స్వస్థపరచుటయనగా మరణము నుండి రక్షణనొందుట. గలిలయయనగా అంతఃకరణము, ఆయన కీర్తి సిరియ దేశమంతటా వ్యాపించెను అనగా ఆయన ఆత్మ అందరిలోను, అంతటా వ్యాపించియుండెను. అనగా క్రీస్తు చైతన్యము వ్యాపకమయ్యెను. నానావిధములైన రోగములనగా సుఖదుఃఖములలోను డచిీడవరికి మరణించుటలోనూ పీడింపబడుట. వ్యాధిగ్రస్తులనగా శరీరానుసారులు. దయ్యము పట్టినవారనగా సాతాను వలన భ్రష్టులైనవారు.చాంద్రరోగులనగా మనస్సాక్షి లేనివారు.  పక్షవాయువుగలవారనగా ప్రాచీన స్వభావముకలిగిన ఆదాము సంతానము నుండి సంక్రమించిన శరీరానుసారులు. గలిలయ, దెకపొలి, యెరూషలేేము, యూదయయను దేశములు అనగా అంతఃకరణము మరియు ఇంద్రియములు సంచరించుచోటు. యెర్దాను(నది)కి అవతలనుండి యనగా అంతఃకరణ వ్యవహహారప్రవాహమునకు ఆవలనున్న అని అర్ధము. దేవదూతలు అనగా ఇంద్రియాధిష్ఠాన దేవతలు. బహుజనసమూహములు అనగా అనేక విధములైన శరీరానుసారులును, అవిశ్వాసులును, విశ్వాసులును, క్రీస్తుగా మారు మనస్సు నొందినవారును ఆయనను వెంబడించెను.అనగా దేవుని వాక్యనుసారము క్రీస్తు యేసును వెంబడించిరి. 

తాత్పర్యముః

       ఇంద్రియములతో గూడిన శరీరము నందున్నట్టి హృదయము నందునాటుకొనునట్లు బోధించుచు,  సర్వవ్యాపకమైన పరిశుద్ధాత్మకు సంబంధించిన జ్ఞానమును సువార్తగా ప్రకటించుచు, వారి హృదయములలో  దేవుని ప్రతిష్ఠింపజేయుచుండెను.సాతాను ప్రేరణకు లోబడి మంచి చెడు పనులు చేయుట వలన వారికి కలిగిన సుఖ దుఃఖ ఫలితములతోను,మరణముతోను పీడింపబడుచున్నవారికి రక్షణ నొసంగుచుండెను. నరుల అంతఃకరణములందున్న ఆంతర్య పురుషులందరిలోను ఆయన దేవుని ఆత్మగా వ్యాపించుచుండెను. అట్టి వ్యాపించియున్నట్టి క్రీస్తు చైతన్యము ద్వారా రక్షణనొందు నిమిత్తము, అనేకులు వెంబడించసాగిరి. వారిలో సాతాను వలనభ్రష్టమైన వారును, మనస్సాక్షిలేనివారును, ఆజ్ఞాతిక్రమణము వలన పాపులైన ఆదాముసంతానమును, ప్రాచీన స్వభావముగల శరీరానుసారలును గలరు. వీరేగాక, అవిశ్వాసులును, విశ్వాసులును, క్రీస్తుగా మారుమనస్సు నొందిన వారు కూడా ఆయనను దేవుని వాక్యానుసారము వెంబడించిరి.

     ''ఆయన జనసమూహములను చూచి కొండ యెక్కి కూర్చుండగా ఆయన శిష్యులాయన యొద్దకు వచ్చిరి. అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధించసాగెను.'' (మత్తయి 5ః1,2)



అర్ధముః

        ఆయన అనగా క్రీస్తు యేసు. జనసమూహమనగా శరీరానుసారులు,అవిశ్వాసులు,ఆత్మానుసారులు, మారుమనస్సు నొందినవారు. కొండయనగా దైవీస్థానమైన భ్రూమధ్యస్థానముయెక్కి కూర్చుండుట యనగా తన శరీర ఇంద్రియక్రియల నుండి భ్రూమధ్యమునకు యెక్కి తానైన ఆత్మస్థితిలో కూర్చుండుట.ఆయన శిష్యులనగా మారుమనస్సు నొంది,క్రీస్తును సాధించినవారు. నోరు తెరచి బోధించుట యనగా దైవప్రతినిధియైన క్రీస్తు యేసు మాట్లాడుటకు నోరుతెరువగా, తండ్రియే ఆ నోటి ద్వారా బోధించుట.

తాత్పర్యముః

         క్రీస్తు యేసుగా నున్న ఆయన అన్యజనులు, అవిశ్వాసులు, ఆత్మానుసారులు, మారుమనస్సు నొందినవారు. మొదలగువారిని చూచి, తానైన ఆత్మస్థితికి యెక్కి కూర్చుండగా, మారుమనస్సు నొంది క్రీస్తుగా మారినట్టి శిష్యులు మాత్రము ఆయనకును మరియు ఆయన ఆత్మస్థితికిని సమీపముగా రాగలిగిరి. అప్పుడాయన  శారీరకముగా నోరు తెరువగా, ఆనోటినుండి తన భ్రూమధ్యమందున్న దైవమే వాక్యానుసారము బోధింపసాగెను. కనుక కొండ మీద ప్రసంగమంతయు దేవుని ప్రత్యక్ష వాక్యము మరియు వేదప్రమాణము. దేవుని వాక్యము బహుజనులందరికినీ అందించబడినప్పటికిని, వారి వారిసాధనను బట్టి వారికవసరమైన మేరకు ఆవాక్యము   వారి అంతరంగ పురుషునికి క్రీస్తు చైతన్యము ద్వారా అందించబడెను. అదృష్టవంతులు వారు ఉన్న స్థితి కంటే ఆపై స్థితిని సాధించుకొనుచున్నారు.           

ప్రసంగముః

    ''ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది.'' (మత్తయి 5ః3)

అర్ధముః

                                                                                                                                           దీనత్వమనగా సిగ్గు అభిమానములను వదలి,పరులనుండి లోక సంబంధమైన వాని కొరకు యాచించుట. ఆత్మవిషయమై దీనుల అనగా, ఆత్మగా నుండుట కై మరియు పరిశుద్ధాత్మచే అభిషేకించ బడుటకు ఆయనను (దైవమును)అర్ధించుట, అందుకొరకై, శరీరాభిమానము నుండియు, ' నేను,నాది' అనుదాని నుండియు విమోచనము నొందుట. పరలోకరాజ్యమనగా నిత్యము,శాశ్వతమునై,తిరిగి మరణమునకు తీర్పులేకుండట.  

తాత్పర్యముః         

లౌకిక విషయముల కొరకు గాక, ఆత్మానుభవము, కొరకుశరీరానుసారమైన వాటిని మరియు దేహభిమానమును విడచి, దేవుని కృపావరములకొరకు విశ్వాసముతోను, నిరీక్షణతోను అర్ధించుచు ఓర్పు,సహనములతో ఆ ప్రార్ధనను నిరంతరము కొనసాగించువారే ఆత్మవిషయమై దీనులు.  వీరు ధన్యులు. ఎందుకనగా పరలోకరాజ్యము వారిదే, అనగా వారు నిత్యము, శాశ్వతము అయిన దైవస్వరూపులగుదురు మరియు మరణమునకు తీర్పు నుండి రక్షించబడుదురు.

             ''దుఃఖ పడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు'' (మత్తయి 5ః4)

 అర్ధముః    దుఃఖమనగా పశ్చాత్తాపము వలన జనించిన ఆర్తి. ఓదార్చబడుట అనగా పాపము నుండి విమోచనకొరకు రక్షణ.

 తాత్పర్యముః  పాపేచ్ఛనుండి విడుదల పొందుచు, అంతకుముందు, వారు చేసిన మంచి చెడు క్రియలకు పశ్చాత్తాప పడుట వలన వీరు దేవుని అనుగ్రహమునకు పాత్రులగుదురు. అట్టి పశ్చాత్తాప జనకమైన దుఃఖమే  దేవుని కొరకు తపనను. ఆర్తిని కలిగించును. వీరు ధన్యులు, ఎందుకనగా వీరు ఓదార్చబడుదురు. ఈ ఓదార్పు ఆత్మానుభవమునకు త్రోవయగును. శరీరానుసారులు పశ్చాత్తాపమువలన ఆత్మానుసారులగుదురు. తిరిగి శరీరానుసారమైన క్రియలు జరుపరు.అందువలన మారుమనస్సు నొందుదురు. దీనికి ఆయన అనుగ్రహము అవసరమైయున్నది. అట్టిదే ఓదార్పు.

      ''సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతత్రించుకొందురు''.(మత్తయి 5ః5)

 అర్ధముః సాత్వికులనగా సత్వగుణ సంపన్నులును, దైవమునకు దాసులైయుండు వారును. భూలోకమును స్వతత్రించుకొనుట యనగా పాపము నుండియు, మరణమునకు తీర్పునుండియు విమోచన నొంది ఈ భూమిపైననే బంధములేక జీవించుట.

 తాత్పర్యముః  తమస్సు వలన దేవుని మరచియుందురు.రజస్సు వలన సాతానుకులోబడి శరీరానుసారక్రియలు జరుపుచుందురు. సాత్వికమైనవారు దైవార్పణ భావముతో ఆత్మానుసారులగుదురు.  

 కనుక సాధనచే,తమోగుణమును, రజోగుణమును అధిగమించినట్టి సాత్వికులు ధన్యులు. ఎందుకనగా వారు దైవానికిదాసులై ప్రవచనమును గైకొనుటకు సిద్ధపడియున్నారు. అట్టివారు ఇతరులకు సుఖశాంతులనొసంగుచూ, వారును సుఖశాంతులనొందుదురు.ఆత్మ సంబంధమైయుందురు. అందువలనవారికి శరీర, లోకసంబంధమైన వాటియందు ఆసక్తియుండదు. మనలనుచెరపట్టి బంధించువన్నియు శరీరానుసారమే. కాని వీరు ఆత్మానుసారులైైనందున బంధము నుండి విమోచనయై ఈభూలోకమును స్వతత్రించుకొందురు, అనగాదీర్ఘశాంతము నొందెదరు.

   ''నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు,వారు తృప్తిపరచబడుదురు''.(మత్తయి5ః6)

 అర్ధముః  నీతియనగా ధర్మశాస్త్రమునకు అతీతమగు దేవుని నీతి. ఆకలిదప్పులనగా ఆత్మానుసారముగా నుండి, ఆత్మానుభవము కొరకు తపన, తహ చెందుట, ఆకలియనగా నిరీక్షణ, దప్పికయనగా దేవుని వాక్యము వినవలెనను తహతహ, తృప్తి పరుచుటయనగా దేవుని ఆత్మచే అభిషేకించబడి తపనను చల్లార్చుట.

తాత్పర్యముః  సాధకుడైనవారు ఆత్మానుసారము జీవించుచు,ఆత్మానుభవము కొరకు తపనజెందుచు,    

 దానికొరకు దేవుని సహాయమును పొందుటకు ప్రార్ధన చేయుదురు. వారు తీవ్రమైన ఆకలి,దప్పిక కలిగినప్పుడేలాగు అన్నపానములకై తపించుచుందురో, ఆలాగుననే క్రీన్తు యేసులోనికి ప్రవేశించుటకై తపనపడుదురు. అట్టివారు ధన్యులు. ఎందుకనగా వారు ఆయనయందు చేర్చుకొనబడుదురు. ఇదియే తృప్తిపరచబడుట.

    ''కనికరముగలవారు ధన్యులు,వారు కనికరము పొందుదురు.'' (మత్తయి 5ః7)

 అర్ధముః కనికరము అనగా దీనులైనవారిపై కలుగునది. కనికరము పొందుట అనగా కనికరము కొరకు దీనులగుట.

 తాత్పర్యముః   కనికరము సాత్వికముకంటే గొప్పది.కనికరము మనస్సులోనుండి జనించునదికాదు.   

 దేవుని ప్రేమ వలన విశాలపరచబడిన అంత:కరణలో సహజముగా జనించునది కనికరము. శరీరానుసారమైన కారణములు లేకనే అందరునూ ఆత్మీయులేయను స్ధిరమైన భావన కలిగినచో దీనులైన శత్రవుల యందును కనికరము పుట్టును. ఇట్టి హృదయశుద్ధి కలవారు ఆత్మవిషయమై దీనులైనందువలన యేసు క్రీస్తు వారిని కనికరించి తనయందుజేర్చుకొనును. వారు ధన్యులు, కనుక కనికరమనునది క్రీస్తు లోనికి నడిపించును.ఆపై దయామయుడైన ప్రభువు వారిని తన యందు జేర్చుకొనుటవలన కనికరము చూపును.

        ''హృదయ శుద్ధిగలవారు ధన్యులు,వారు దేవుని చూచెదరు.'' (మత్తయ 5ః8)

 అర్ధముః హృదయశుద్ధియనగా సంకుచితమైన అంతఃకరణను విశాల పరుచుకొనుట ద్వారా జరుగునది.  దేవుని చూచుట యనగా ఆయనను ప్రత్యక్షతపరచుకొనుట.

 తాత్పర్యముః  ధైర్యముతోను, శోధనతోను, ప్రేమతోను కూడిన ఆత్మానుసారమైన జీవితము వారియొక్క సంకుచితమైన అంతఃకరణ విశాల పరచబడును మరియు హృదయశుద్ధి జరుగును. అట్టివారు ధన్యులు. ఎందుకనగా వారు లోకసంబంధమైన, వాటినుండియు శరీరసంబంధమైన వాటినుండియు విమోచన పొందుదురు మరియు ఆత్మ సంబంధకులగుదురు. కనుక వారి పరిశుద్ధమైన హృదయములలో దైవము యొక్క ప్రత్యక్షతగలుగును.  

  ''సమాధానపరచు వారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు.'' (మత్తయ 5ః9)

 అర్ధముః  సమాధానమనగా దైవము విషయములోను, దైవసాక్షాత్కారమార్గములోను హృదయపూర్వకవిశ్వాసముగలిగి, దానిని సాధించుకొనుటకు కట్టుబడియుండుట.దేవుని కుమారులనగా, యేసుక్రీస్తును తండ్రి  తనకుమారుడని ప్రకటించిన విధముగానే వారును ఆయనతో సమానముగా దేవుని కుమారులనబడుట.

తాత్పర్యముః  వారు శరీరానుసారముగాకాక, పరిశుద్ధాత్మలక్ష్యముగా ఆత్మానుసారముగా జీవించుచు,

 లక్ష్యముపై చెదరనిగురి కలిగియుందురు మరియు ప్రవచనానుసారము సాధన మార్గముపై ఎట్టి అనుమానములేని వారైయుందురు. ఈవిధమైన నిశ్చయముతో కట్టుబడియుండి నిరీక్షించుటయే సముధానము. వీరు ధన్యులు. ఎందుకనగా వీరు క్రీస్తుయేసునందు ప్రవేశించి, యేసుక్రీస్తునందు చేర్చుకొనబడుదురు. అప్పుడు  వీరును ఆయన స్వరూపులై, ఆయనవలే దేవుని కుమారులనబడుదురు.

 ''నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.'' (మత్తయి 5ః10)

 అర్ధముః నీతియనగా ధర్మశాస్త్రము వర్తించని అతీతమైన దేవుని నీతి.హింసింపబడుటయనగా క్రీస్తుగా మారుమనస్సునొందినప్పటికిని, పూర్వపుక్రియల వలన కలిగిన ఫలితములు యింకను బాధించుచుండుట. పరలోకరాజ్యమనగా శాశ్వత నివాసము మరియు మరణమునకు తీర్పులేని స్థితి.

 తాత్పర్యముః దేవుని నీతికి లోబడిన వారి క్రియలు దేవుని నిర్ణయానుసారముండునని వారికి     

 తెలిసియుండుదురు.ఇక అవన్నియు వారి నిర్ణయములు ఎన్నటికినికావు గనుక, వారు చేయుపనులు మంచివి గాని, చెడ్డవిగాని, వారికి వర్తించవు. ఇట్టి స్థితిలో క్రీస్తు న్యాయస్థానమందున వారు తీర్పునుండి తప్పించబడిన వారైయుందురు. అయినను పూర్వము వారుచేసిన మంచి చెడు క్రియలు వారి వారి చిత్తములతోనే జరిపించబడుచుండును.వాని ఫలితములు వారిని హింసించుచునే యుండును. ఇట్టి హింసలు,వారిని క్రీస్తుస్థితి యందుండుటకు పరీక్షలని యెంచి,ఇదియును తమమంచికేయని ఊరకయుండువారును,ప్రతిచర్యజరుపుటకు సాతానువలన ప్రేరణ పొందనివారును ధన్యులు.ఎందుకనగా ఇట్టి స్థితిలో వారు శాశ్వతమైన పరలోకరాజ్యనివాసమునకు తగినవారై యుందురు మరియు హక్కుదారులై యుందురు.

''నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్లపలుకు నప్పుడు మీరు ధన్యులు; సంతోషించి,ఆనందించుడి,పరలోకమందు మీ ఫలము అధికమగును.ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.'' (మత్తయి 5:11,12)

అర్ధముఃనా నిమిత్తము అనగా దేవునిఆత్మను సాధించునిమిత్తము. జనులు అనగా సాతాను ప్రేరితజనులు. నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకుటయనగా విశ్వాసులను లోబరుచుకొనుటకై, వారినిహింసించుచు, దైవమార్గము అసత్యమని తెలుపుచు వెంబడించుట. సంతోషించి, ఆనందించుట యనగా, పూర్వపు మంచిచెడు క్రియల ఫలితములను అనుభవించుట ద్వారా,దేవుని చిత్తమును నెరవేర్చినవారై వారు విమోచనము నొందుచున్నారని సంతోషము. పరలోక మందు ఫలము అధికమగ అనగా,యిట్టి సాధన వారి క్రీస్తు స్థితి చెదరకుండునట్లు వారికిది పరీక్షయని యెంచుట మరియు ఇక వారి సాధన పురోగమించుట.

 తాత్పర్యముః దేవుని పరిశుద్ధాత్మచేత అభిషేకించబడుటకు సాధకుడుచేయు ప్రయత్నమునకు సాతాను వలన ప్రేరితులైన జనులు వారిని నిందించుచు, హింసించుచు, దైవమునకు వ్యతిరేకమైన సాక్ష్యములతో ప్రలోభపెట్టుచు,అడ్డుపడుచుందురు.ఇట్టివన్నియు తన హృదయపూర్వక విశ్వాసమునుండి చెదరకుండునట్లు తనను క్రీస్తు నందు ప్రతిష్టితమగుటకు పరీక్షలని యెంచుచుండవలెను. అట్టివారు స్థిరమైయున్నచో వారు ధన్యులు. ఎందుకనగా వారి సాధన పరలోక రాజ్యనివాసమునొందు మార్గమును సరళమగునట్లు అంతకంతకు వృద్ధిచెంది, అధికఫలమిచ్చును. ఇట్టిఫలము సిద్ధించవలెననిన, ఎట్టికఠినమైన హింసలనైనను, పరీక్షలనైనను ఎదుర్కొని, అవియన్నియు తనను పరలోకమునకు జేర్చుటకు అవసరమైనవని తెలిసి సంతోషించుచు, ఆనందించుచు, సాధనను ఉత్సాహముతో కొనసాగించవలెను.         

    ''మీరు లోకమునకు ఉప్పై యున్నారు; ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు''.

(మత్తయి 5ః13)

 అర్ధముః లోకమునకు ఉప్పు అనగా శరీరానుసారమైనవారికి ఆధారమైన తెలివి; నిస్సారమనగా అవివేకము. త్రొక్కబడుటయనగా తిరిగి మరణమునకు తీర్పులోనికి వచ్చుట; పారవేయుటయనగా దేవుని చేరక వ్యర్ధమగుట. దేనికిని పనికిరాదు అనగా మనుష్యుని జన్మ నిరర్ధకమై నరకములోనికి త్రొక్కివేయబడుట.

 తాత్పర్యముః  ఏపదార్ధమైనను ఉప్పులేనిచో రుచించదు. రుచిలేని పదార్ధమును పారవేయుదుము గాని అనుభవించము. అట్లు పారవేయబడిన పదార్ధములన్నియు మంటిలోనికి త్రొక్కివేయబడును. ఇక అవి దేనికీపనికిరాదు. అటులనే దేవుని ఆత్మచేఅభిషేకించబడుటకు అందరును ఆయనచే నియమింపబడి పిలువబడినవారే. దానినెరుగని వారు అవివేకులు, బుద్ధిహీనులు.కనుక సారవంతమైన ఉప్పు అందరికినీ కావలసియున్నది. వివేకమనగా దేవుని తెలిసియుండి, ఆత్మానుసారముగా జీవించు తెలివి. అట్టి వివేకమను సారవంతమైనఉప్పులేనివారు బుద్ధిహీనులు.వీరి శరీరానుసార జీవితము వ్యర్ధము.వివేకము లేని మనుష్యులు మరణమునకు తీర్పు చెప్పబడుదురు. కావున వీరు దేవునికి దూరముగా విసిరివేయబడినవారును, మరణముచే త్రొక్కబడినవారును అగుదురు.ఉప్పును నిస్సారమనిన,వారి వివేకము లోకానుసారమైనదేగాని దైవానుసారముకానిది. లోకానుసారమైన బుద్ధి సాతానుప్రేరితము మరియు వ్యర్ధము. దైవానుసారమైనబుద్ధి వారి హృదయములను శుద్ధపరచి,వారి ఆత్మలు పరిశుద్ధాత్మచే అభిషేకించబడినట్లు చేయును.

 ''మీరు లోకమునకు వెలుగై యున్నారు,కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అదియింటనుండు వారి కందరికిని వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదే పెట్టుదురు''. (మత్తయ 5ః14,15)

అర్ధముః వెలుగు అనగా ప్రకాశము. కొండమీద నుండు పట్టణమనగా భ్రూమధ్య స్థానము. మరుగై యుండనేరదు అనగా తప్పక అనుభవములోనికి వచ్చును. కుంచము క్రింద దీపము పెట్టుట అనగా ఆ వెలుగువలన ప్రయోజనము లేకుండుట. దీపస్తంభము మీద పెట్టుట అనగా, అంతటను కనబడునట్లు పెట్టుట.

తాత్పర్యముః దేవుని ప్రకాశము నరుల భ్రూమధ్యస్థానమందు వెలుగుచున్నది. అజ్ఞానమను కుంచముచే ఆవెలుగు ప్రకాశము ఇంద్రియములపై  బడుటలేదు. అందువలన దేవుని మరుగుపరచెను. అజ్ఞానమను కుంచమును తీసివేసి, ఆవెలుగు అందరకిని కనబడునట్లు దీపమును దీపస్తంభముపై పెట్టినట్లుగా, అజ్ఞానమునువిడచి, భ్రూమధ్యస్థానమును స్థంభముపై నిలబెట్టినచో ఆవెలుగు దేవుని మరుగుచేయదు.అనగా ఆత్మానుభవము కలుగును.

  ''అడుగుడి మీకియ్యబడును; వెదకుడి మీకు దొరకును; తట్టుడి మీకు తీయబడును; అడుగు ప్రతివాడును పొందును; వెదుకువానికి దొరుకును; తట్టువానికి తీయబడును'' (మత్తయి 7:7,8).

అర్ధముఃఅడుగుటయనగా జ్ఞానముకొరకు అర్ధించుట. వెదుకుటయనగా జ్ఞానముకొరకు వెదకుట. తట్టుట యనగా పరిశుద్ధపరచబడిన హృదయద్వారమును తట్టుట. తీయబడుటయనగా హృదయద్వారము తెరువబడుట. అడుగు ప్రతివాడును పొందుననగా ఆత్మానుభవమును పొందును. వెదుకువానికి దొరకుననగా పరిశుద్ధాత్మకు సంబంధించిన జ్ఞానము లభించును. తట్టువానికి తీయబడుననగా, జ్ఞానముతో వారి హృదయమును శోధించిన, దైవ సాక్షాత్కారమునకు అడ్డుగానున్న తెర తీయబడును.

తాత్పర్యముః ఎవరైతే పరిశుద్ధమైన జ్ఞానముతో ఆయన సాక్షాత్కారము కొరకు ప్రార్ధింతురో, వారికి సత్యము యొక్క అనుభవము అనుగ్రహించబడును. సత్యస్వరూపజ్ఞానము కొరకు అన్వేషించువారికి 

 ఆ సత్యము అనుభవములో సిద్ధించును. పరిశుద్ధపరచబడిన హృదయ ద్వారమును ఎవరు తట్టగలరో వారికి అక్కడనే దైవసాక్షాత్కారమునకు అడ్డుగానున్న తెరతీయబడును. సమర్ధులైన వారెవరైనను, అట్టిప్రతివానికిని సత్యము, జ్ఞానము, అనుభవము అనునవి తప్పక సిద్ధించును.

  ''నాశనమునకు పోవు ద్వారము వెడల్పును,ఆదారి విశాలమునై యున్నది.జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై యున్నది. దానికనుగొనువారు కొందరే''.

 (మత్తయి 7:13,14)

అర్ధముః నాశనమునకు పోవుద్వారమనగా శరీరానుసారము.ఇది సాతాను వలన యేర్పడినది. జీవమునకు పోవు ద్వారమనగా ఆత్మానుసారము. ఇది క్రీస్తుయేసను నరుడైనవాడును, మార్గము, సత్యము, జీవము తానైనవాడును యేర్పాటు చేసిన ప్రేమమార్గము.

 తాత్పర్యముః సాతానుచే యేర్పడిన మార్గము వెడల్పును, విశాలమునై యున్నది. అన్యజనులును,  అవిశ్వాసులును అయిన అందరికిని ఈ ద్వారము అందుబాటులో నుండి ప్రలోభపెట్టుచున్నది. కాని దీని ప్రవేశమువలన పాపము,నరకము, మరణమునకు తీర్పు మొదలగునవి కలిగి బాధించును. క్రీస్తు యేసును నరుడు తానే మార్గము, సత్యము జీవమునైయుండును. ఈ ద్వారము ఇరుకు, సంకుచితమైయున్నది. ఇందు ప్రవేశించువారు దేవునిచిత్తముగా పరీక్షించబడుదురు.పరీక్షలలో నిందలు,అవమానము, హింసయెదుర్కొందురు.చివరకు సిలువ వేయబడుదురు.అయినను వీటిని లెక్కచేయని ధైర్యవంతులుకొందరే. వారుమాత్రమే ఈ ద్వారమును ప్రవేశించగలరు. ప్రేమ, కరుణ, ఓర్పు, శాంతి, దైవార్పణలతోనిండిన మరియు విశాలపరచబడిన అంత:కరణ గలిగినవారే యీ ద్వారమున ప్రవేశించగలరు.వారు సత్యానుభవమునొందుదురు. అన్యజనులు ప్రవేశించజాలరు.

''ఆ కొండ మీదనుండి దిగి వచ్చినప్పుడు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను''. (మత్తయి 8:1)

అర్ధముః కొండదిగుటయనగా తిరిగి శరీరభావన లోనికి వచ్చుట. బహుజనసమూహములనగా అన్యజనులు, అవిశ్వాసులు, విశ్వాసులు, వెంబడించుటయనగా శరీరానుసారముగా వెంబడించుట.

తాత్పర్యముః యేసుప్రభువు తన దైవీస్థితి నుండీ దిగి వచ్చెను.ప్రవచనము పూర్తి అయ్యెను. ఇప్పుడు ఆయనను శరీరానుసారులు వెంబడించసాగిరి.ప్రవచనమును మాత్రము ఆయన శిష్యులైనవారు మాత్రమే వెంబడించిరి.ప్రభువు యొక్క ప్రవచనమునకు లోబడినవారు, వారి వారి స్థితులను బట్టి తెలిసికొని, కొంతవరకు మార్పుచెందిరి.ఆయన మహిమను గుర్తించినవారు ఆశతో వెంబడించిరి. వ్యాధులనుండియు, రోగముల నుండియు విమోచన కొరకు క్రియామూలమైన విశ్వాశముతో వెంబడించిరి. ప్రవచనము ప్రకారము వెంబడించినవారు కొందరే. వారందరును కలసి బహుజనులుగా వారికి సాధ్యమైన పద్ధతిలో వెంబడించి తగిన ఫలితమును పొందిరి.