3.శరీరానుసారులు - ఆత్మానుసారులు

3.శరీరానుసారులు - ఆత్మానుసారులు

 ''శరీరము మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. శరీరమూలముగా జన్మించిన మీరు క్రొత్తగా జన్మించవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఆత్మ మూలముగా జన్మించినవాడు ఆలాగే(నూతనముగా) యున్నాడనెను.''

                                                            - (యోహాను 3-6,8)

    తల్లితండ్రుల (శరీరముల) కలయిక వలన కలిగినది శరీరము. అనగా పురుషుని శుక్లము మరియు స్త్రీ శోణితముల కలయిక చేత యేర్పడిన పిండమే శరీరమగును. ఇట్టి శరీరమునకు ఆధారమైన చైతన్యమును (శక్తి) అందించునది ఆత్మ. ఈ ఆత్మ అనునది ముందుగా దేవుని యందు వాక్యముగా  నుండెను. తదుపరి అన్ని శరీరములందు ఆంతర్య పురుషుడై యున్నది.  ఆత్మ ఏకమై ఉన్నదని తెలియుటయే జ్ఞానము.

    ఆత్మ మూలముగా జన్మించి, జ్ఞానమై యున్న మానవుని యందున్న (ఆత్మ) దీనికి మరణము లేనందున నిత్య నూతనము. ఇట్టి జ్ఞానము పొందిన వాడు ఆత్మ స్వరూపుడగును. అందుకని అతడు శరీరానుసారమైన మనస్సును మార్చుకొని తాను ఆత్మను అనుస్థితి(ధ్యాస) విడువక యుండవలెను. ఇది సాధించిన వాడు క్రొత్తగా జన్మించిన వాడగున్ష్ము మారుమనస్సు పొందిన వాడగును.

     మారుమనస్సు పొందిన శరీరానుసారులు ఆత్మానుసారులగుదురు. ఇంను శరీరానుసారులకును ఆత్మానుసారులకును భేదమేమనగా ''శరీరానుసారులు శరీరవిషయముల మీద మనస్సు నుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయము మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును , సమాధానమునై యున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధియై యున్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావ వలసిన వారైయుందురు గాని ఆత్మ చేత శారీరక క్రియలు చంపిన యెడల జీవించుదురు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించ బడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.'' - (రోమా 8-5,6,7,13,14). కావున '' మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయము అను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవము అను పంటను కోయును. (గలతి 6:7,8).

    జీవము అనగా మరణమునకు తీర్పులేనప్పుడు  కలుగు నిత్యజీవము. నిత్యజీవము నొందిన వారు మరల పాపమును చేయరు. కనుక  అజ్ఞానముచేత  వారు శరీరమును పొందరు. ఏమైనను శరీరమునకే మరణముగాని, నిత్యజీవమైన వానికి మరణమునకు తీర్పు ఉండదు.ఎందుకనగా ''ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయ పడకుడి. ఆత్మ దేహమును కూడా నరకములో నశింపచేయు వారికి భయపడుడి.'' (మత్తయి 10:2) రక్షకుడైన ప్రభువు మాత్రమే తీర్పు చెప్పును కనుక ఆయనకు భయపడుడి.

    శరీరానుసారముగా జీవించుట అనగా శరీరమే నేనని జీవించుట. దీని వలన మరణమునకు తీర్పు తీర్చ బడును. ఆత్మానుసారముగా జీవించుట అనగా తాను ఆత్మనని భావించుచు, పాపము వలన శరీరము ఇక రాకుండుటకు గాను ప్రవర్తించుట మరియు  యిప్పటి శరీరమును పవిత్ర కర్మలకై వినియోగించు కొనుట. నిత్యజీవములో అజ్ఞాన సంబంధమైన భయమును వేదనలతో కూడిన మరణమును ఎప్పుటికిని కలుగవు. ఆత్మానుసార జీవనము ఫలితముగా ఆత్మగా నిత్యజీవమై ఉండును. జ్ఞానము వలన అవిద్య నశించును. తిరిగి శరీరమే తానను అజ్ఞాన సంబంధమైన  పాపముతో కూడిన మరణము ఉండదు. ఎందుకనగా శరీరమునకే మరణము కాని ఆత్మకు ఎప్పుటికిని మరణము సంభవించదు.

    ఆత్మానుసారముగా నడచు కొనినచో వారు స్వార్ధమును, కోరికలను  నెరవేర్చరు. శరీరము ద్వారా ఆత్మయు, ఆత్మ-శరీరమునకు ఆధారమైయున్ననూ భౌతిక వ్యవహార భేదముచేత ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి అజ్ఞానముచే నిశ్చయింతురో వాటిని చేయకుందురు. తలచిన మేలు, క్రియలలో జరుగదు. కీడు చేయ వద్దను కొన్నను కీడు చేయ ప్రేరణ కలిగి కీడు చేయ బడును. ''శరీరకార్యములు స్పష్టమై యున్నవి. అవియేమనగా అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మోహము, అభిచారము, క్రోధము, కక్ష, బేధములు, విమతములు, అసూయ, మత్తత మొదలగునవి. వీటిని చేయు వారు దేవుని రాజ్యమున స్వతంత్రించు కొనరు. అయితే ఆత్మ ఫలమేమనగా సంతోషము, ప్రేమ, సహనము,  దీర్ఘ శాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము (అనాసక్తత) మొదలగునవి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారిమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడచుకొందుము. ఒకరినొకరు వివాదము రేపకయు, ఒకరియందు ఒకరు అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందుము.'' - (గలతీ 5:19-22,25).

    దేవుని నెరుగుటకు అడ్డుగా  నిలచిన  కార్యములు అపవిత్రము. కాముకత్వమనగా లోక సంబంధ విషయములతో శరీరేంద్రియ సుఖములు పొంద వలెనని తీవ్రమైన కాంక్ష మరియు అన్ని విధముల తన స్వార్ధమునకై ప్రయత్నించుట. రాగ ద్వేషములు, అరిషడ్వర్గము, ఈర్ష్య, అసూయ, దంభము, దర్పము, అహంకారములతోగూడిన ప్రతిక్రియలు సాతాను వలన కలిగినందున, అట్టి క్రియలు, ఆలోచనలు, భావములు శరీరానుసార క్రియలగును. సర్వవ్యాపకమైన తండ్రి అన్ని వస్తువులలోను, సర్వజీవులయందును ఉండెను. ఎందువలన అనగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగ లేదు. అయినను సృష్టి పదార్థములు శరీరాను సారులకే గాని జ్ఞానులకు కాదు. అందున్న సర్వవ్యాపకుడైన దేవుని తమయందును, సృష్టియందును ఎరుగుట జ్ఞానులకే వీలగును. విగ్రహమందే గాక, సర్వమునందు ఆయనయే ఉన్నాడన్న అనుభవము జ్ఞానమై ఉన్నది. పైగా యెహోవా గాక యితర దేవతా విగ్రహారాధన మూర్ఖము మరియు అంధ విశ్వాసము. ఇట్టి విశ్వాసములు పెరుగునట్లు ప్రచారము చేయునవి విమతములు. ఆత్మ ఫలము ఏదనగా ఆత్మానుభవము. ఈ అనుభవము శరీరముండునంత వరకు శాంతమును కలుగ జేయును. తదుపరి వారు యేసుక్రీస్తు నందు చేర్చుకొన బడుదురు. దీనికి క్రమ మార్గమును అవలంబించ వలెను. మానవులందరికి దేవునిచే నిర్ణయించ బడిన మార్గము ఆత్మానుభవము కొరకేగాని దీనిని అజ్ఞానులు గ్రహింపకుండిరి.

     అందరు స్వతంత్రులుగా ఉండుటకు క్రీస్తుచే పిలువ బడితిరి. అయితే ఆ సాతంత్య్రమును శారీరక క్రియలు జరుపుటకు హేతువు చేసికొంటిమి. ఈ శరీరము వలన ''నేను'' అనునది కలిగినది. ఈ నేను అను అహం వృత్తి వలననే సుఖదు:ఖములు అనుభవించ బడుచున్నవి. కాని దేవుడు ఈ శరీరమును క్రీస్తుగా మారుట కవసరమైన సాధనముగా వినియోగించుట కొరకు మాత్రమే మనకిచ్చెను. ఈ ''నేను'' దైవమే అను అనుభవము కొరకు వచ్చెను. ఇది గ్రహించిన వారు ఆత్మానుసారముగా జీవించి, తండ్రి ఆజ్ఞను నెరవేర్చెదరు.  కాని అజ్ఞానులు ఈ శరీరమును హేతువు చేసుకొని క్రీస్తుగా మారుటకు బదులు భ్రమచేత  లోక సంబంధ విషయములలో తిరుగాడుచు  సుఖదు:ఖముల నొందుచు, శరీరానుసార జీవనము ద్వారా మరణమునకు తీర్పు తెచ్చుకొను చున్నారు. కాని మనము ప్రేమ కలిగిన వారమై యొకనికొకడు దాసుడై యుండినచో అది ఆత్మానుసారమగును. దైవేచ్చ ప్రకారమైతే యీశరీరాత్మలలో  తాను ఆత్మయే కాని శరీరము కాదని తెలిసి కొనుటకు ప్రయత్నము చేయవలెను. అట్టి ప్రయత్నము కొరకే ఈ శరీరము కలిగినది. కాని యీ కలిగిన శరీరమును ఆత్మ జ్ఞానము నొందుటకు బదులుగా శరీరేచ్ఛలను నెరవేర్చు కొనుటకు నరులు వినియోగించుచున్నారు. అందువలన వారు (అజ్ఞానముచే) పాపులగు చున్నారు. మనము ప్రేమ కలిగిన వారమైతే ఇతరుల కొరకు త్యాగమును, తన శ్రమలను ఓర్చు కొనుటకు  సహనమును , వేదనను భరించుటకు శాంతమును అలవరచుకొందుము. క్రీస్తు మార్గమనగా ప్రేమ మార్గము. క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఈ అభిషేకము దేవుని ఆత్మచే జరిగినది. అందు వలన క్రీస్తుచే పిలువ బడినవారు అభిషిక్తులె,ౖ వారును క్రీస్తు లగుదురు. కాని శరీరానుసారులు తమ  మనస్సుకు సంతోషకరమగు క్రియలు చేయుదుదు.  ఆత్మ ప్రభోదము వలన ప్రేరేపింపబడిన మేలైన క్రియలను  చేయకుందురు.

    కనుక ఆత్మానుసారులు యిక శరీర, లోక సంబంధమైన వాటికి వారి ఇంద్రియముల ద్వారా ఆకర్షింపబడరాదు. వీరికి యోహాను చెప్పినదేమనగా

    ''ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయూ అనగా శరీరాశయు, నేత్రాశయు , జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించి పోవుచున్నవిగాని, దేవుని చిత్తమును జరిగించు వారు నిరంతరమును నిలుచును'' - (1యోహాను 2: 15-17).

    మన మనస్సు తనకు ఆకర్షింప జేసికొను పదార్ధములే లోకము.  అనగా కోరికతో వాటిని పొందగోరుట. లోకములో నున్నవి అనగా అనుభవించుటకు ప్రేరణ నిచ్చునవి, అనగా అవి కనబడుట వలన కోరిక పుట్టించునవి. ఈ విధముగా మనలో నున్న మోహము వలన గాని, క్రొత్తగా పుట్టిన కోరికల వలన గాని, భూ లోక సంబంధమైన వాటిని ప్రేమించిన యెడల వారు దైవమును ప్రేమించ లేరు. ఎందుకనగా లోకములో అనుభవింపబడున దేదైనను శరీర సౌఖ్యమునకు గాని, ప్రియం మోదం ప్రమోదములతో విషయానందముగా ఇంద్రియ తృప్తికే జరుగును. కాని  ఆంతర్యపురుషుడైన ఆత్మకు ఇవి ఎన్నడును లేవు. ఆత్మకు సర్వుల యందు ప్రేమ తత్త్వమున్నది. కనుక శరీరేంద్రియములు ఇచ్చునది ఆత్మ సంబంధమైన ప్రేమ కానేరదు. అవి మనస్సు వరకే చేరునుగాని ఆత్మకు చేరవు. జీవపు డంబమనగా జీవుడనే నేనను జన్మార్జితమైన బలీయమైన భావము.  ఇది తండ్రి వలన పుట్టినది కాదు. మనుష్యుడు చేయు మంచి చెడులక్రియల ఫలితమును జ్ఞాపకములుగా తిరిగి అనుభవించునదే జీవపు డంబము. జీవపు డంబమనగా నేను నాది అనునది. ఇది శరీరానుసారము వలన కలిగినది. దీనిని ఆత్మానుసారముగా మార్చుకొనినచో  జీవపుడంబము (అహంకారము) నశించును. అప్పుడు తాను ఆత్మను అను యదార్ధ నేను లేక సత్యము అనుభవములోనికి వచ్చును. కనుక జీవపు డంబము మనలను బంధించు జైలు వంటిది. ప్రభువు కృపావరముచే మరణమును జయించ వలెనన్న క్రీస్తు మార్గము తప్పని సరియై ఉన్నది. ఇది త్యాగమయ  జీవనము ద్వారా కల్గును.

    ''మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లి తండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు,  అతి ద్వేషులు,  అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించు వారు. పైకి భక్తి కలవారై ఉండియు, దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. పాపభరితులై నానావిధములైన దురాశలచేత నడిపింపబడి, యెల్లప్పుడును నేర్చుకొనుచున్నను, సత్యవిషయమై అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేకులు.'' చెడిన మనస్సు కలిగి విశ్వాసములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు.

                                    - (2తిమోతి 3:2-6,8)

    మనుష్యులు దైవేచ్ఛ ప్రకారము జీవించ వలెననిన శరీర ఇంద్రియములకు సుఖము కావలెనను పిపాస లేక కోరిక అడ్డు పడుచున్నది. ఇట్టి కోరికను నిగ్రహించ వలెననిన కొన్ని మంచిక్రియలను పాటించుచు, ఇంద్రియములను నిగ్రహించు కొనుచు, తన స్వభావమును బాగు చేసుకొన వలెను. గర్వమును, అహంకారమును విడచి దేవుని యందు నిజమైన భక్తి విశ్వాసములు పెంపొందించు కొన వలెను. సత్యమును ఎదిరించక, సత్యవిషయమైన అనుభవ జ్ఞానమును పొందుట కొరకు క్రమ సాధన, త్యాగ వైరాగ్యములను అభ్యాసము చేయ వలెను. యేసు క్రీస్తు చూపిన ప్రేమ మార్గములో సాధన చేయ వలెను. సాధన అనగా మెలకువ, కల, గాఢనిద్ర అను మూడు అవస్థలలోను  ఆత్మానుసార జీవనమే పాటించవలెను. ''ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింప వలెను.'' ( మత్తయి 16:24) . తనను తాను ఉపేక్షించుకొనుట యనగా శరీరానుసారమైన భావమును విడచుట మరియు ఆయనను వెంబడించుట యనగా ఆత్మానుసారముగా నడచుకొనుట. తన సిలువనెత్తికొనుట యనగా ఆయన సిలువపై మరణించి పునరుత్థానమైన సాదృశ్యముతో ఐక్యత పరచుకొనుటను మార్గముగాను, లక్ష్యముగాను ఎంచుకొని సాధన చేయుట. అనగా శరీరముగా మరణిఙంచి, ఆత్మగా మేల్కొని, నిత్యజీవమగుట. (మరణమును జయించిన క్రీస్తుగా మారుట).
మంచినడతకు మార్గము

1. యే ప్రాణఙకి కోరి హాని చేయకుము. - అహింస

2. కలయందైనను అబద్ధమాడకుము, పితూరీలు చెప్పకుము. - సత్యము.

3. పరుల సొమ్ము ఆశించకము, పరుల శ్రమను దోచకుము. - అచ్చియుండకు.

4. దైవ చింతన మానకుము, ఆత్మానుసారముగా జీవించుము - క్రీస్తు

5. సర్వజీవుల యందు కనికరముతో నుండుము. - దయ

6. మానవత్వములోను, భక్తి విశ్వాసములలోను కాపట్యము లేక నిజాయితీ కలిగి ఉండుము.

                                                              - సత్ప్రవర్తన

7నీకు కీడు చేసిన వానిని క్షమించుము. - క్షమ

8. ఆత్మానుసారముగా జీవించు నప్పుడు కలుగు అడ్డంకులను ధైర్యముతో ఎదుర్కొనుము. - ధీరుడు

9. దైవ సాధనకు వీలుగా సాత్వికాహారమును మితముగా భుజించుము. - మితాహారము

10. దేవుని ధ్యానించుటకు మనస్సును సిద్ధపరచుటకు, నీ దేహమును, పరిసరములను శుభ్రముగా

     నుంచుకొనుము. - శుభ్రత.

ఆత్మానుసార మార్గము

1. దేవుని వాక్యమును గ్రహించి, లోతైన విచారణతో ఉండుము.  - తపస్సు

2. ఏది ప్రాప్తించినను విచార పడక సంతోషముగా ఉండుము. - సంతోషము

3. దేవుడున్నాడను విశ్వాసముతో నుండుము. - యెహోవా

4. పరోపకారము చేయుము - దానము

5. ప్రభువును నీ హృదయమందు యెడతెగక ధ్యాస యందుంచు కొనుము - ఆరాధన

6. దేవుని వాక్యమును విశ్వాసపూర్వక మనస్సుతో గ్రహించుము - వాక్య శ్రవణము

7. నీ బలహీనతలను అంగీకరించుటకు మార్పు చెందుటకు సిగ్గు పడకుము - విధేయత

8. విన్న వాక్యమును గ్రహించి, ఆచరించి తిరిగి స్పష్టముగా ఇతరులకు బోధించే చురుకైన బుద్ధిని కలిగి ఉండుము. - తెలివి.

9. దేవుని గురించి స్పష్టముగా యెరిగిన దానిని భావముగా నిరంతరము నీ ధ్యాసలో నుంచు కొనుము. - ధ్యాస.

10. ఆత్మాను సారము జీవించుటను విడనాడని  దీక్ష కలిగి ఉండుము. - దీక్ష.

11. సర్వము దైవమే అని స్థిరపడి సాక్షిగా ఆశ్రయించి జీవించుము. - జీవము