4.విశ్వాసులు

4.విశ్వాసులు

     ''విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటియొక్క నిజస్వరూపమును , అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు ఋజువై ఉన్నది.'' - (హెబ్రి 11:1)

     దృశ్యమైనవి అందరికి ఎరుకే గాని, అదృశ్యమైనవి లేవనుట అవివేకము. దైవము అదృశ్యము కనుక, తెలిసిన దాని నుండి విచారణ సాగించి, తెలియని దానిని వివేకముతో అనుభవ పూర్వకముగా తెలిసికొన వలెను. ముందుగా పెద్దల వలన తెలిసిన దానిని ప్రమాణమనియు, సత్యము అనియు నమ్మి విశ్వాసము కలిగి ఉండ వలెను. దైవము ప్రత్యక్షతగా ఉండడు. కాని అనుభవము ద్వారా  పొందవలసినది మాత్రమే. అయినను, తండ్రియైన దేవుడు విశ్వాసులమైన మనకు ఋజువు చేయుటకై యేసుక్రీస్తును ప్రత్యక్ష పరచెను. ఆయన ద్వారానే తండ్రి యొద్దకు జేరు మనెను. ఇది దైవ వాక్యమైనందున వేద ప్రమాణము.   

    ''విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము.'' -(హెబ్రి 11:6).

    దేవుడు ఆత్మ స్వరూపమున మనకంటే వేరు కాదు గనుక ప్రేమ స్వరూపుడైన దేవుడు మనలో నిజమైన ప్రేమగా ప్రతిష్ఠితుడయ్యెను. అందువలన ఆయనకు మనపై ఇష్టము కలిగి ఉండెను. కాని అది  మన విశ్వాసము వలన అనుభవ పూర్వకముగా తెలియ బడును.

    ''మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము.''                                             (1తిమోతి 4:12).    

    శరీరానుసారులు మాటలలోను, ప్రవర్తనలోను, పవిత్రతలోను తండ్రిని ఎరిగినట్లుండ జాలరు. ఆత్మానుసారులు విశ్వాసములో తమ పూర్ణత్వమును సంపాదించు కొని నందున దైవమునకు ప్రతినిధు లగుదురు. ఎందుకనగా తండ్రి యొక్క కృపావరముచే మనము విశ్వాసము ద్వారా తండ్రితో ఐక్యత పరచు కొనుచున్నాము. ''కనుక విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయతను కలిగి యదార్ధ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము.'' - (హెబ్రి 10: 22).

            హృదయమనగా సత్యముండు చోటు లేక దైవముండు మందిరము. కావున యదార్ధ హృదయమనగా అజ్ఞానమైన మనస్సుగా కాక, సత్యత్వముతో నిండిన హృదయము. కనుక యదార్ధ హృదయము గల విశ్వాసికి గాని క్రీస్తు యేసు మార్గము తెలియదు. అందుకని అన్యజనులు మొదట విశ్వాసులుగా మార వలెను. విశ్వాసులగుటకు యీలాగు చేయవలెను.

    ''ఎవడును కీడుకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి. మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైన దానిని ఎన్నుకొనుడి. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి. యెడతెగక ప్రార్థన చేయుడి. ప్రతివిషయము నందు కృతజ్ఞతా స్తుతులు  చెల్లించుడి. ఈలాగు చేయుటయే యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.'' (1ధెస్స 5:15-18). ప్రార్ధన , కృతజ్ఞతా స్తుతులనగా తెలియ వలెను.

    ప్రార్థన :- ప్రార్ధన చేయుట అనగా శరీరమే నేనను భావము నుండి విడుదల కాబడి, ఆత్మయే నడిపించుచున్నదను భావన కలుగునట్లు మారుమనస్సు నొందుటకు దేవుని ఆశీర్వాదమును కోరుట. యబ్బేజు చేసినట్లు ప్రార్ధన చేయవలెను.

    యబ్బేజు యితర సహోదరుల వంటి వాడు కాదు. యబ్బేజు అనగా వేదన వలన కలిగిన వాడు. శరీర, లోక సంబంధ విషయములలో అమితముగా వేదన పొంది, ఫలితముగా వాటి నుండి విడుదల పొందినవాడు. ఆత్మగా భావించుచున్నట్టి  వాడు.  ఇతడు వేదన వలన నూతనముగా జన్మించిన శోధన పుత్రుడు. అందువలన అతని ప్రార్ధన ఈ విధముగా ఉండెను.

    ''నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నా సరిహద్దులు విశాల పరచి, నీ చేయి నాకు తోడుగా ఉండునట్లు చేసి, నాకు కీడు రాకుండ దాని నుండి నన్ను తప్పించుము. '' - (1 దిన వృత్తాంతము 4-9,10).

    పాపేచ్ఛ వలన ప్రతిఫలముగా కలిగినట్టి శరీరమే నేను అను పరిమిత భావముతో ఉన్నాను. ఈ విధముగా  నేను ఏర్పచుకొనిన సరిహద్దును విశాల పరచి అందువలన ఆత్మయే నేను అని మారు మనస్సు నొందుటకు దేవుని సహాయమును, ఆశ్వీర్వాదమును కావలెనని యబ్బేజు ప్రార్ధించెను. ''దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయ చేసెను. '' అనగా ప్రార్ధన ఫలించెను. ఇట్లు ఫలించగల ప్రార్ధన హృదయ పూర్వక విశ్వాసము వలననే సాధ్యమగును.

కృతజ్ఞతాస్తుతులు :- కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనగా తనకు తానై ఏపని చేయుచున్నాడనుట అసత్యమనియు  దేవుని చేతనే  అన్ని పనులు జరుగుచున్నవని యెంచి  నేను ,నాది అనునది లేకుండగ ఊరకుండుట. ''మాటచేత గాని, క్రియ చేత గాని మరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు, సమస్తము ఆయన పేరిట(ఆయన నామమున) చేయుడి.'' - (కొలస్సి 3:17). ఈ విధముగా చేసిన సర్వము ఆయనకు అర్పించినట్లగును , ఆయన పేరిట పనులు జరుపువాడే విశ్వాసి మరియు ఆత్మానుసారుడు.


పశ్చాత్తాప నివేదనము

 ఓ దైవమా

    యెహోవా!

    ప్రేమ స్వరూపా

    కరుణామయా!

    ఓ గాడ్‌! ఫాదర్‌ ఇన్‌ హెవెన్‌!

 పరమదయానిధివగు ఓ ప్రభువా !

    మా పాపములన్నిటికిని

    మేము పశ్చాత్తాప పడుచున్నాము.

 అసత్యము, అధర్మము,

    అపవిత్రము నగు

    మా ప్రతి తలంపుకునూ

    మేము పశ్చాత్తాప పడుచున్నాము.

 పలికి యుండరాని

    పలికిన ప్రతి మాటకును,

 చేసియుండరాని

    చేసిన ప్రతి చేతకునూ,

    మేము పశ్చాత్తాప పడుచున్నాము.

 స్వార్థముచే ప్రేరేపింపబడిన

    ప్రతి పనికిని, ప్రతి మాటకునూ,

    ప్రతి తలంపునకునూ

    ద్వేషముచే ప్రేరేపింప బడిన

    ప్రతి పనికిని, ప్రతి మాటకునూ

    ప్రతి తలంపునకునూ,

    మేము పశ్చాత్తాప పడుచున్నాము.

  ముఖ్యముగా కామముతో కూడిన

    మా ప్రతి తలంపునకూ,

    కామ ప్రేరితమగు మా ప్రతి చేతకూ,

    పలికిన ప్రతి అనృతమునకూ,

    సమస్త కపట వర్తనమునకూ,

    ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకూ,

    సమస్త పరనిందలకూ

    పరోక్ష నిందలకూ

    మేము పశ్చాత్తాప పడుచున్నాము.

 ఇంకనూ ముఖ్యముగా కూడ,

    పరులకు నాశన మొనగూర్చినట్టి

    మేము చేసిన ప్రతి పనికినీ:

    ఇతరులకు బాధ కలుగ జేసిన

    మేమాడిన ప్రతి మాటకునూ,

    చేసిన ప్రతి చేతకునూ,   

    ఇతరులకు బాధ కలుగ వలెనని

    మేము కోరిన ప్రతి కోర్కెకునూ,

    మిక్కిలి పశ్చాత్తాప పడుచున్నాము.

 అపార దయానిధివగు ఓ ప్రభువా!

    మేము చేసిన యీ పాపములన్నిటికిని

    మమ్మును  క్షమించమని వేడుకొను చున్నాము.

తలపులలో గాని, మాటలలో గాని, చేతలలో గాని

    నీ ఇచ్ఛానుసారము నడచుకొన జాలక

    నిరంతరము విఫల మగుచున్న

    మమ్ములను క్షమింప వేడుకొను చున్నాము.

                      ------ ఒ -----ప్రియ దైవమా!

     నిన్ను అధికాధికముగా ప్రేమించుటకునూ ఇంకనూ అధికముగా, ఎంతో అధికముగా నీతో ఐక్యమగు నంతటి అర్హత గలవారమగునంత వరకునూ, నిన్నింకనూ అధికతరముగా ప్రేమించుటకునూ, చిట్టచివరి వరకూ నీ కొంగును గట్టిగా పట్టుకొని ఉండుటకునూ మా కందరకు సహాయము చేయుము.

             మనుష్యులమైన మనము అన్ని పనులు ఆయన పేరిట చేయుట ద్వారా మన ఇంద్రియములకును, మనస్సుకును మంచి చెడు క్రియల ఫలితములు అంటకుండును. ఈ విధముగా శరీరేచ్ఛ నిగ్రహించ వీలగును. ఎందుకనగా దేవుని పేరిట ఎవడును దుష్ట కార్యములు చేయడు కదా!

    అజ్ఞాన కాలమందు నుండి తన పితరుల ద్వారా సంక్రమించినది ప్రాచీన స్వభావము. ఇది మనలను శరీరానుసారులుగా చేసినది.  శరీరవిషయములలో మంచి చెడులను నిశ్చయించుచు, తన స్వార్దమును నెరవేర్చుచుండును. దేవుని యందు నిజమైన విశ్వాసము తన హృదయములో  కలుగ వలెననిన, ఇట్టి  ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి, జ్ఞానము నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచ బడుచున్న నవీన స్వభావమును ధరించు కొన వలెను. విశ్వాసులు , అవిశ్వాసులు అను బేధములేక ''కీస్తే సర్వము మరియ ఆ క్రీస్తే అందరిలో ఉన్నవాడై యున్నాడు'' అని విశ్వసించ వలెను. - (కొలస్సి 3:11).

    ప్రాచీన స్వభావము అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము , అవ్వలకు కలిగిన స్వభావము. అది మనకు సంక్రమించినది. ఆదాము సంతానమైన మనము ఇప్పుడు జ్ఞానము కలుగు నిమిత్తము ఆ ప్రాచీన స్వభావమును విడువ వలెను. సృష్టించిన వాని పోలిక చొప్పున అనగా సాతాను మాట వినక పూర్వము  ఆదాము అవ్వలు దేవునితో సమానులై , ఆయన పోలిక చొప్పున ఉండిరి. శరీర భావము లేక ఆనందముగా ఉండిరి.  ఈ కాలములో నైతే క్రీస్తు యేసను దైవ కుమారుడు మృతులలో నుండి యేలాగు లేపబడెనో  అట్టి సాదృశ్యముగా నడచుకొను కాలము. నవీన స్వభావము అనగా మారు మనస్సు నొందుట వలన యేర్పడినది. ఇది జ్ఞానమునకు త్రోవ చూపును. ఎందువలన అనగా దేవుడు నరులను మొదట తన పోలికగా సృష్టించెను. మరల దానిని గుర్తుచేసి, ఋజువు పరచుటకు ప్రభువైన యేసు క్రీస్తును పంపెను. దీనిని యెరుగుటయే జ్ఞానము. క్రీస్తే సర్వముగాను, అందరిలో నున్న వాడిని గాను హృదయ పూర్వకముగా విశ్వసించి యెరుగుటయే జ్ఞానము. కనుక జ్ఞానము విశ్వాస మూలముగా కలుగును. విశ్వాసము మరియు జ్ఞానము వలన   శరీరానుసారమైన క్రియలు విడువ బడును. ఎందుకనగా విశ్వాస జ్ఞానములకు శరీరానుసారమైనవి విరుద్ధము.

    శరీరానుసారమనగా అవయవములతో గూడిన స్థూల దేహమే నేనని జీవనమును జరుపుట మరియు తన ఇంద్రియములతో లౌకిక విషయములపై ఆకర్షణకు, ఇచ్ఛకు లోబడి తన శరీర, ఇంద్రియ సుఖముల కొరకు జీవనము జరుపుట. శరీరము పాపము వలన తన పూర్వక్రియలకు ఫలితములను అనుభవించుట కొరకై ఏర్పడి, చివరకు మరణించునదే. కావున పాపమనగా సుఖ దు:ఖములతో గూడిన జీవితము మరియు అజ్ఞానపూర్వక మరణము. ఈ మరణమును, మరణ భయమును పోగొట్టు కొన వలెను. శరీర సంబంధ క్రియలు చేయకను, ఆత్మయే నేనను భావముతో స్వార్థము లేకుండాను శరీర, ఇంద్రియ సుఖములకు ప్రాధాన్యత నివ్వకను దైవీ భావముతో జీవనము జరుప వలెను. ఇదియే ఆత్మాను సారము.

      ఆత్మానుసారముగా జీవించ వలెననిన శరీరమును, దాని వ్యవహారము నందు ఆసక్తిని నిరసించ వలెను. తుదకు ఆత్మానుభవమును పొంద వలెను. ఇందు కొరకు శరీర ధర్మములను ఆత్మ ధర్మములను వివరముగా తెలిసికొని శరీరానుసార జీవనమును మాని ఆత్మానుభవమునకు వలసిన సాధనమును నిజజీవితమునందు  చేయ వలెను.