5. శరీరానుసారమును నిరసించుట

5. శరీరానుసారమును నిరసించుట

    శరీరమనగా స్థూల, సూక్ష్మ, కారణ శరీరములని మూడు విధములు. స్థూల శరీరము రక్తము, మాంసము, రసము, ఎముకలు, మూలిగ, చర్మము, మేధస్సు అను సప్త ధాతువులతో కూడినది. ఇది కంటికి స్థూలముగా గోచరించునది. ఇది అన్నము వలన పుట్టి,  అన్నము వలన వృద్ధి చెంది,  అన్నము లేనిచో కృశించి, నశించు ధర్మము కలది. ఇది బాల్య, కౌమార, యౌవ్వన, వృద్ధాప్య పరిణామములు పొంది, ఒకప్పుడు లేక, మధ్యలో వచ్చి మరల లేక పోవునది. ఇది ప్రాణము లేనిచో శవముగా మారును. కనుక స్థూల శరీరము తానుగా వ్యవహారము చేయలేదు. కనుక స్థూల శరీరము నేను కాదు, ప్రాణమును నేను అని ఉండవలెను.

    కాని నిద్రించు చున్నప్పుడు ప్రాణమున్నను లోక వ్యవహారము లేదు మరియు ఇంద్రియములు పని చేయుట లేదు. ప్రాణమే సత్యమైనచో దాని వలన జరుగు క్రియలు ఒకసారి ఉండి మరియొకసారి  లేకుండుట జరుగ రాదు. ఎందుకనగా సూర్య కిరణములు సూర్యుని నుండి ఎల్లప్పుడు ప్రకాశించు చున్నట్లు, ప్రాణము ఎల్లప్పుడును ఇంద్రియముల నంటియుండవలెను. కాని అట్లు జరుగుట లేదు. రాజుండగా భటులు రాజు యెదుట నిద్రించరు కదా, కాని ప్రాణమున్నను ఇంద్రియములు విశ్రమించు చున్నవి. కనుక ప్రాణము సత్యము కాదు. కనుక నేను అను యజమాని శరీర ప్రాణములు కాదు.

    ఈ విచారణనను మరింత లోతుగా కొనసాగించినచో ప్రాణము ఉన్నను మనస్సు లేనిచో నేను చేయు క్రియలకు నాకు అనుభవము వచ్చుట లేదు. ఎందుకనగా గాఢ నిద్రలో నా మనస్సు పని చేయుట లేదు. అక్కడ నాకు ఏమియు తెలియుట లేదు. గాఢనిద్రలో వ్యవహారము లేదు. అనగా మనస్సు ఉన్నప్పుడే  వ్యవహారము జరుగుచున్నది. అందువలన మనస్సే నేను అయి ఉండ వలెను. నేను అనునది సత్యమైనచో, మనస్సు కూడా సత్యమే. సత్యమనగా సూర్య ప్రకాశము వలె నిరాటంకముగా ప్రసరించ వలెను. భూమి తిరుగుట వలన రాత్రియందును, మేఘములు అడ్డు పడుట వలన పగలును చూచు వాని దృష్టికి కనుపించదు గాని, సూర్య కిరణ ప్రకాశము ఎల్లప్పుడును ఉండును. కాని మనస్సు విషయములను, ఇంద్రియములను గాఢ నిద్ర యందు ప్రకాశింప జేయుట లేదు. అనగా తెలియపరచుటలేదు. అందు వలన మనస్సు సత్యము కాదు. కనుక మనస్సు నేను కాదు. ఇంను మనస్సు ఆలోచించునే గాని యే పని చేయుటకు నిర్ణయించదు. నిర్ణయమైన పిదపనే అనుభవముగాని కేవలము ఆలోచించు చున్నందు వలన వ్యవహారము జరుగుట లేదు. బుద్ధిచే నిర్ణయమైన పిదపనే కర్మము, ఫలితము అనుభవములోనికి వచ్చుచున్నవి. అందువలన నేను అను అనుభవమునకు నిర్ఱయము చేయు బుద్ధియే కారణమగుచున్నది.

    బుద్ధి నిర్ఱయములన్నియు, తన సుఖ సంతోషముల కొరకే గాని, దు:ఖమునకును, నష్టమునకును, వేదనకును ఏ నిర్ఱయము జరుగుట లేదు. కనుక బుద్ధి తాను నిర్ఱయించుటకు  మరియొక యజమానిపై ఆధార పడి ఉన్నది. కాని అది దైవము వలన కలుగు ఆనందమును ఆనభవించక విషయముల ద్వారా అట్టి సంతోషమును ప్రియము, మోదము, ప్రమోదము అను మూడు స్థితులలో పొంద ప్రయత్నించుచున్నది. ప్రియమనగా వస్తువుపై యిష్టత, మోదమనగా అది లభించినందుకు కలుగు సంతోషము. ప్రమోదమనగా ఆ వస్తువును అనభవించుటవలన కలిగిన తృప్తి. ఈ విధముగా చిత్తము వ్యవహార భేదము లేకుండా ప్రియ, మోద, ప్రమోదములను ఆమోదించుచూ నిరంతరము ప్రవాహరూపమున ప్రేరణనిచ్చుచూ త్రిగుణశక్తికి మూలమై యుండును. నేను అనెడి  ఈ యజమాని చిత్తములో వృత్తి రహితమైన చోట వశించుచున్నాడు. కాని వృత్తుల ద్వారా వర్తించ ప్రయత్నించు చున్నాడు.  కనుక చిత్త వృత్తులు ఆగినచో నిజమైన ఆనందము లభించ గలదు. కాని చిత్త వృత్తులు శరీర సంబంధమై నందు వలన అట్టి నిజమైన ఆనందము లభించుట లేదు.

    అందు వలననే శరీరానుసారమైన క్రియలకు మూలమైన స్థూల శరీరము నేను కాదనియు, ప్రాణము నేను కాదనియు, మనో బుద్ధులు, చిత్తము నేను కాదనియు, యెంచి నా శరీరము యెడల అభిమానమును నిరసించినచో నాకు  యదార్ధమైన ఆనందము కలుగుచున్నది. ఇట్టి ఆనందము కొరకు శరీరానుసారముగా కాక, ఆత్మయే లక్య్షముగా , నేను ఆనంద స్వరూపముగా గల యజమాని ననియు భావించుచు జీవించ వలెను, అనగా తానే దైవమని ఆత్మానుసారము గావలెను.

    చిత్తవృత్తులే శరీరానుసారమైన అనుభవములకు మూలము. ఇవి తప్పనిసరిగా అంకురించును. అందు వలన మనస్సు వృత్తి సంబంధ ఆలోచనలను విడువ జాలదు. అందుకే మనస్సు చంచలమనియు, ఏకాగ్రత చెందించుట కష్టమనియు చెప్పుదురు. శరీరానుసారమైన అభిమానముతో అనుభవమును పొందు ''నేను'' ను అహంకారమందురు.

    చిత్తవృత్తుల క్రమమేమనగా తాను పూర్వమందు చేసిన శరీరానుసార క్రియలకు కలిగిన మంచి చెడుల ఫలితములే మరల మరల తన అనుభవములోనికి సుఖదు:ఖ రూపముగా అంకురించుట. ఈ విధముగా వృత్తులు బయలు పరచు చిత్తము, తదనుగుణముగా ఆలోచించు మనస్సు, అనుభవముల కొరకు నిర్ణయించు బుద్ధి మరియు అనుభవించు అహంకారము, యీ నాలుగును కలిసి అంత:కరణ చతుష్టయ మందురు. చిత్తవృత్తులను నిరోధించినచో అంత:కరణము శుద్ధమగును. ఆత్మానుసార జీవితము చేతనే అంత:కరణ శుద్ధి జరుగును.   ఆత్మానుసారుడు

మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు

చిత్తము కాదు నేను, నేను అహంకారమును కానే కాదు

విను చెవిగాని, చూచు కన్ను గాని నేను కాదు

జిహ్వయైన, నాసికయైనను నేను కాదు.

భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశములు నేను కాదు.

నన్ను బ్రతికించు ప్రాణము నేను కాదు.

సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన వాయువులు నేను కాదు.

అన్నమువలన పుట్టిన అవయవములు కాదు నేను. పుట్టి, పెరిగి, నశించు దేహమును నేను కాదు. రక్త, మాంస చర్మములు కాదు, అస్తి మజ్జ రసములు కాదు, మెదడు కానే కాదు. శరీరమే నేను కాదు. మంచి చెడులు చేయు చున్న ఇంద్రియములు నేను కాదు.

అందు వలన నాకు లేవు రాగ ద్వేషములు, మంచి చెడు ఫలితములు, అరి షడ్వర్గము లేదు నాకు, సుఖదు:ఖములు శరీరానుసారులకే గాని నాకు లేవు. మాన అవమానము లేదు, అభిమానము నాకు లేదు. శరీరానుసారమైన తల్లి లేదు, తండ్రి లేడు అందుకని బంధుమిత్రులు లేరు, జన్మ లేదు, మరణము లేదు. ఎందుకంటే అవి శరీరానుసారులకే గాని ఆత్మకు కాదు.

ఆత్మ నిత్యము, ఆత్మ సత్యము, ఆత్మ శాశ్వతము. నాకున్నది నిత్యజీవము, నేనున్నది యేసులోనే.

నేను ఆత్మను, నేను ఆత్మను, పరిశుద్థాత్మను.