6.ధర్మశాస్త్రము - నీతి

 6.ధర్మశాస్త్రము - నీతి  

                                   ''మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు  మరణార్ధమైన ఫలములను ఫలించుటకై ధర్మ శాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను'' (రోమా 7:5). ధర్మశాస్త్రము మంచి చెడులను అందుకు తగిన ప్రతి ఫలమును నిర్ణయించును. మన అవయవములుగాని, ఇంద్రియములుగాని మంచి చెడు క్రియలు చేయుచున్నవి కాని అవి మనలో నున్న పాపేచ్ఛ వలన నడిపించ బడుచున్నవి. మనము ఆత్మాను సారులమైతిమా పాపేచ్ఛల వలన జరుగు దుష్క్రియలు ఆగి పోవును. సత్క్రియల ఫలితముగా ధర్మశాస్త్రము మనకు వర్తించదు.  అందు వలన మరణమునకు తీర్పు ఇవ్వబడదు. అయినను ధర్మశాస్త్రము చెడ్డది కాదు. దాని వలననే మనకు గుణ పాఠము కలిగి దేవుని వైపునకు తిరుగు చున్నాము.

     ''ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా నెట్టిదో తెలియక పోవును. ఆశించ వద్దని ధర్మశాస్త్రము చెప్పని యెడల దురాశయన ఎట్టిదో తెలియక పోవును. అయితే అజ్ఞానము, (అవిద్య) దేవుని ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను మనయందు పుట్టించెను.  ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు  ధర్మశాస్త్రము లేకుండ జీవించుచుంటిమి గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను.'' (రోమా 7:7-9). అజ్ఞానము ద్వారా (ఆదాము ద్వారా) పాపమును, పాపముద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో అలాగుననే ఆదాము వారసులమైనట్టి యీ మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికిన్నీ సంప్రాప్తమయ్యెను.

    ఆదాము అవ్వలు ఆయన ఆజ్ఞను అతిక్రమించక మునుపు  ధర్మశాస్త్రము లేదు, పాపమును లేదు. తరువాతనే పాపమునకు జీవము కలుగునట్లు దేవుడు ఆజ్ఞ యిచ్చెను. ఈ జీవము శరీరమునకు హేతువు గాని, ఆత్మ నిత్యజీవమై యున్నది.  తిరిగి తాను దేవుని పోలిన వాడనని తెలిసికొనుటకు సాధన జేయ వలసి ఉన్నది. ఆత్మానుభవమునకు శరీర మనస్సులు అవసరమని, అవి మనకు దేవునిచే దయ చేయ బడెను. కనుక ''తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు అనగా తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువుచేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు. ''(రోమా 4:7-8). ప్రాయశ్చిత్తమనగా శరీరానుసార జీవితము అసత్యమని యెంచి, వైరాగ్యమునొందుట. ఆత్మానుసారుడు తుదకు క్రీస్తు అగును, అనగా పవిత్రుడగును. మంచి చెడు క్రియల మూలమైన వృత్తి నుండి విమోచన నొందును. కనుక అట్టి క్రియలకు తీర్పు ఇవ్వబడదు. ఆ విధముగా ధర్మశాస్త్రము క్రీస్తుకు వర్తించదు మరియు ప్రభువుచే నిర్దోషి యని యెంచ బడును. కనుక క్రీస్తయిన వాడు క్రీస్తు యేసు(నిర్వాణము) నందు ప్రవేశించును. అట్టి వాడు ధన్యుడు. ఇది ఆత్మానుసారునికి కలుగబోవు ఫలితము.

    ధర్మశాస్త్రమునకు తెలిసి లోబడుటయే సాధన, లేక విధేయత. తెలియక పోయినను, ధర్మశాస్త్రము శరీరానుసారులకు యివ్వవలసిన ఫలితముల నేర్పరచి యుంచు చుండును. ఇవన్నియు దేవుని ఉగ్రత దినమందు తీర్పులోనికి తీసికొని రాబడును. సాధకుడు ధర్మశాస్త్రమునకు విధేయుడు. ''ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదును. అయితే పాపమునకు, శరీర సంబంధియై యున్నాను. ఏలయన, నేను చేయునవి నేనెరుగుదును, నేను చేయ నిచ్ఛయించునది చేయక, ద్వేషించునది చేయు చున్నాను. ఇచ్ఛయింపనిది చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్ఠమైనదైనట్లు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేనుకాదు ''(రోమా 7:14-20). ఆత్మ చే నడిపించబడుచున్న నేను ధర్మశాస్త్రము అనుసరించు వాడను, మరియు మేలైన క్రియలు చేయ నిచ్ఛయించువాడను. కాని నాయందు నివసించు పాపమే నా చేత స్వార్ధపరమైన క్రియలను జరిపించుచున్నది.

   ''మేలైనది చేయ వలెననెడి కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయ గోరు మేలు చేయక చేయ గోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయునది నా యందు నివసించు పాపము గాని యిక నేను కాదు. '' (రోమా 7:17,19,20) .'' నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసింపదని నేను ఎరుగుదును.'' (రోమా 7:18) ఈ వాక్యముల అర్థము నేను వేరు, నా యందు నివసించు పాపము వేరు అని గోచరించుచున్నది. పాపమే త్రిగుణముల వలన శరీర సుఖమును, ఇంద్రియముల సుఖమును కోరుచున్నది మరియు క్రియలను తన స్వార్ధము కొరకు అజ్ఞానముచే జరుపుచున్నది. ఈ పాపము అనగా శరీరమే  నేను అనబడునది ఆత్మ ప్రబోధమునకు విరుద్ధముగా స్వతంత్రించుచున్నది. పాప క్రియలన్నియు దుష్క్రియలు. ఆత్మ కోరునది సత్క్రియలు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనప్పటికిని, యీ మనస్సు పాప క్రియలు జరుపు అనుభవముతో ఏకమైనట్లున్నది.  ఈ భావమే శరీరానుసార క్రియలకు హేతువు. యీ భావము నుండి వేరై, నిస్వార్థముగా ఉండుటకు సహనము, ఓర్పు , సాత్వికము, దీర్ఘశాంతము అను సత్క్రియలు జరుపు చుండ వలెను మరియు పాప ప్రేరిత క్రియలను సహనము, శాంతము అను సాత్విక గుణముతో ఎదిరించి జీవించుటయే ఆత్మాను సారము. ఆత్మానుసారముగా జీవించుట అనగా, నా యందున్న అంతరంగ పురుషునిగా నేనే సత్యమని యుండుట, మరియు బాహ్య పురుషుడైన పాపము అను  శరీర అభిమానము నడిపించునది మరణమునకే గాని , దీర్ఘశాంతమైన సత్యమునకును, నిత్యజీవమునకును మాత్రము కాదు.

    ''అంతరంగ పురుషుని బట్టి ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. వేరొక నియమము నా అవయవములలో నున్నట్లు కనబడు చున్నది. అది నామనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచూ నా అవయవములలో నున్న పాప నియమమునకు నన్ను చెర బట్టి (బంధించి) లోబరుచు కొనుచున్నది. ఇది ఎంత దౌర్భాగ్యము! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును? కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను.'' (రోమా 7:22-25).

    కనుక మనస్సాక్షికి లోబడుట జ్ఞానము. పాప నియమమునకు లోబడుట అజ్ఞానము. అజ్ఞానము బంధించును. జ్ఞానము బంధమునుండి తప్పించి నిత్యజీవమునకు గొని పోవును. కనుక పాపమే మన నిత్యజీవమునకు అవరోధము. శరీరేచ్ఛయు, దురాశతో జరుపు క్రియలు పాపమును పుట్టించును. ''విశ్వాసమూలము కానిది పాపము.''  (రోమా 14:23).

    ఎందుకనగా విశ్వాసమూలము కానిది శరీరానుసారమైనది. శరీరేంద్రియ స్వార్థమునకై జరుపు మంచి చెడు క్రియలు మరణమునకు చేర్చును. మరణము కొరకు శరీరమును, సుఖదు:ఖములను అనుభవించుటకు డంబమును పుట్టించును. డంబము అనగా నేను నాది అను అహంకారము. అందుకే  ''దురాశ గర్భము ధరించి పాపమును కనగా , పాపము పరిపక్వమై మరణమును కనెను.'' (యాకోబు 1:15). ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్ను ఎవరు విడిపించును? మరణమునకు తీర్పు ఎట్లు వచ్చును? ఎవరు తీర్పు నిచ్చెదరు?

                                    

 ''తండ్రి యెవనికిని తీర్పు తీర్చడుగాని తీర్పు తీర్చు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు''. (యోహాను 5-22,23). ''కుమారుని యందు విశ్వాసము కలవాడే నిత్యజీవము కలవాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి యుండును'' (యోహాను 3-36). యేసు యిలాగు చెప్పెను '' నన్ను పంపిన వాని యందు విశ్వాసము ఉంచు వాడు నిత్యజీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.'' (యోహాను 5-24).

    యేసు క్రీస్తును పంపిన వాడు తండ్రియైన యెహోవా. ఆ దేవుని యందు విశ్వాసము నుంచువాడు తప్పక క్రీస్తుగా మారును. మరియు వాడు క్రీస్తుయేసుగా నిత్యజీవము కలవాడగును. నిత్యజీవమనగా యేసు నందు ప్రవేశించిన వాడగుట. వాడు యిక మరణమునకు తీర్పు తీర్చ బడడు.

    క్రీస్తు న్యాయస్థానములో ఉగ్రత దినమందు తీర్పు యివ్వబడును. ''ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచు దినమందు  నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొను చున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియలను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వానికి నిత్యజీవము నిచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు.

(1) ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరు  ధర్మశాస్త్రము లేకయే నశించెదరు.

(2) ధర్మశాస్త్రము కలిగిన వారై  పాపము చేసిన వారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.

(3) ధర్మశాస్త్రముననుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.'' (రోమా 2:5-13).

ఒక్కసారి నీతిమంతులైనచో ధర్మశాస్త్రము వారికి ఏమాత్రము వర్తించదు.  ''మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్పు తీర్చ బడునట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను. అయినను విశ్వాసము వెల్లడి ఆయెను కనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము.''(గలతీ 3:24-26) ఎందుకనగా ''క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియైయున్నాడు '' .రోమా (10:4) క్రీస్తు స్థితిని పొందినవాడు నీతిమంతుడై ఉండును. నీతియనగా దేవుని నీతి.కనుక ఈ నీతి ధర్మశాస్త్రమునకు అతీతమైనది.

    కనుక శరీరానుసారులకే ధర్మశాస్త్రము. వారు క్రీస్తు దినమందు మరణమునకు తీర్పు తీర్చ బడుదురు. ఆత్మానుసారులు యేసు ప్రభువు నందు హృదయ పూర్వక విశ్వాసముచే నీతిమంతులుగా ఎంచబడుదురు. దేవుని నీతిని స్థిర పరచుటకు ధర్మశాస్త్రమును సమాప్తము చేయుచున్నాడు. ఆపై ''రెండవ దానిని స్థిర పరచుటకు మొదటి దానిని కొట్టి వేయుచున్నాడు.''

-(హెబ్రి 10-9).