7. దేవుని చిత్తము

7. దేవుని చిత్తము

     ''జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.'' జారత్వమనగా ఆజ్ఞను అతిక్రమించుట., ఆదాము అవ్వలు దేవుని చిత్తమును వ్యతిరేకించి పాపమునకు జారి పోయిరి.'' కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును, ఘనతయందును  తన ఘటమును (శరీరమును) ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలచెను గాని, అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.'' (1థెస్స 4:3-5,7).

     ఘటమనగా శరీరము. ఈ శరీరమును పాపేచ్ఛలకుగాక ఆత్మానుభవమునకు సాధనముగా వినియోగించుటయే దేవుని చిత్తము. అందువలననే  ఈ శరీరము మనకు వచ్చినది. కామాభిలాష ఉన్నచో తిరిగి తీర్పునకు లోబడి దేవుని ఉగ్రతకు లోనగును. దీనిని ఎప్పుటికైనా నివారించు కొనక తప్పదు.  కనుక దేవుని ఆజ్ఞకు లోబడి, ఆత్మానుసారము, ప్రేమ పూరితమైన హృదయమును సంపాదించు సాధన అత్యంత అవసరమై యున్నది. దేవుడు ''తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున, యేసు క్రీస్తు ద్వారా తన కుమారులను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును, నిర్దోషులమునై యుండ వలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను'' (ఎఫెసి 1:6). దేవుని యందు భూతవర్తమాన భవిష్యత్తులు లేవు. కర్మలు జరుపుకొను చున్న మనకు యీ కాలము లున్నవి. ఏకాలమునందైనను సృష్టించ బడుచున్న నరులందరును ఆయన వద్దకు చేర వలసిన వారే. అట్టి ప్రణాళిక దేవునిచే ఎప్పుడో చేయబడెను. అన్నియు ఆయన వల్లన,ే ఆయన మూలముగానే జరుగుచున్నవి. చివరకు ఆయన యందు చేర్చుకొనబడుట కూడా ఆయన ఇచ్ఛయే. కనుక మనము చేయునది ఏమియు లేకయే అన్నియు దైవచిత్త ప్రకారము జరుగుచున్నవి. ఇది యెరిగి ఉన్నవాడు తన శరీరము కొరకు శ్రమించడు. ఆయన సంకల్పమునకు సర్వము విడచి పెట్టి తాను ప్రశాంతముగా ఉండును.'' ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమి మీద ఉన్నవే కాని, సమస్తమును క్రీస్తు నందు ఏకముగా సమకూర్చుకొనవలెనని తనలో నిర్ణయించుకొనెను'' (ఎఫెసి 1:10).  ''నీ చిత్తము (దేవుని చిత్తము) ను పరలోకము నందు నెరవేరు చున్నట్లు భూమియందును నెరవేరును'' (మత్తయి 6:10). భూలోకమందు జరుగు ప్రతి క్రియను పరలోకమందు దైవీ ప్రణాళిక ననుసరించియే జరుగుచున్నది. అందువలన ఇచ్చట జరుగుచున్న వన్నియు పరలోకమందు ముందుగా నిర్ణయించి నట్లుగానే జరుగుచున్నవి.ఙ

     కనుక మన నిజస్థితి క్రీస్తులోనే యున్నది.  క్రీస్తుగా ఉండుటయే సత్యము. సత్యమును మరచి పాపము చేయుట వలన మనము అన్యజనులమైతిమి. అన్యజనులైన వారిని క్రీస్తుగా మార్చుటకు మొదట మనము విశ్వాసులుగా మారుటయే దేవుని చిత్తము. భ్రష్టులైన నరులను విశ్వాసులుగా మార్చుటకు యెహోవా తనను గురించియు , తన మహిమ, ఉగ్రతల గురించియు ప్రవచనముల ద్వారా తెలియ పరచెను.

    దేవుని చిత్త ప్రకారము అప్పటి జారులు, మూర్ఖులు, అవివేకులు , బుద్ధిహీనులు వారి భ్రష్ట క్రియలనుండి పరివర్తన చెంది యెహోవా యందు విశ్వాసులైరి. అయినను మంచివి గాని, చెడ్డవి కాని క్రియలు జరుపుట వలన వారు యింకను క్రియల వరకే విశ్వాసులైరి. కాని నీతిమంతులగుటకు ఆ విశ్వాసము హృదయ పూర్వకమును, పూర్ణ వివేకముతో గూడినదై యుండవలెను. కనుక వీరికి సత్యమును తెలియ పరచి, అట్టి సత్యములో ప్రతిష్ఠించుటకు మార్గమును తెలియ పరచ వలెను. ఈ సత్యమును, మార్గమును, జీవమును బోధించుటకును, సాదృశ్యముగా జీవించి, ఆయన జీవనమును విశ్వాసులైన వారు అనుసరించుటకుగాను దైవకుమారుడు  అయిన యేసు క్రీస్తు పవిత్రమైనట్టి మనుష్యశరీరమును ధరించి క్రీస్తుగా మరణించెను. మరల తండ్రి చేత యేసుగా  లేప బడెను. దయామయుడైన దేవుడు పతనమైన నరులను క్రీస్తు మార్గమున నడిపించుటకు అనేక విధములుగా ప్రయత్నించెను. చివరగా తనను పోలిన క్రీస్తును నరుల కొరకు పంపెను. ఆయన అన్నింటి యందు, తనను మనలకు సాదృశ్యపరచుచు బోధించెను. ఇందు కొరకు ఆయన శరీరముగా అనేక శ్రమలు పొంది, సహనము, శాంతి, ప్రేమను కన పరచుచు, చివరికి, సిలువపై క్రీస్తుగా మరణించెను.



దేవుని చిత్తము(సాధన):-

1. నీకు సంబంధించి, నీ శరీరావసరములకును, కుటుంబ అవసరములకును, సమాజమునకును, నీకున్న బాధ్యత నుండి తప్పించుకొనవద్దు. అయినను శరీరము నీవు కాదు గాని ఆత్మవే అయి ఉన్నావని మరువ వద్దు.

2. లోక సంబంధమైన వానిలో నీకున్న సమస్త ధర్మములను తప్పక నెరవేర్చుము. కాని వీటిని విశ్వాస పూర్వకముగా చేయుము మరియు ఇదంతయు ''ప్రభువు యొక్క ఆజ్ఞయే'' యని నిరంతర భావన మనస్సులో కలిగి ఉండుము.

3. నీకు ఆనందము కలిగినప్పుడు ''ప్రభువు నన్ను ఆనందింప గోరుచున్నాడు'' అను కొనుము. నీకు బాధ కలిగి నప్పుడు ''ప్రభువు నన్ను బాధ పడగోరు చున్నాడు'' అనుకొనుము. కాని ఇదంతయు నన్ను క్రీస్తులోనికి నడిపించుటకే యని నిరంతరము భావించు చుండుము.

4. నీవు యే పరిస్థితిలో నున్నను ''ప్రభువు నన్ను యీ పరిస్థితిలో నుంచెను'' అని విశ్వాస పూర్వకముగా చలించక ఉండుము. కాని మంచి చెడు క్రియలు చేయుటకు యీ పరిస్ధితిని కారణముగా నెంచకుము. అంతయూ ప్రభువుచిత్తము మేరకు జరుగుచున్నది యని తెలిసి జీవించుము.

5. ''ప్రభువే ప్రతి ఒక్కరిలోను కలడు'' అనెడి యదార్ధ భావమును నిరంతరము నీ యందు నిలుపుకొని పరోపకారము చేయుము. పొరుగు వానిలో అతని స్వభావమును గాక, ప్రభువుని మాత్రమే చూడుము. అప్పుడే నీవు చేయు మంచి పని యైనను నీలో అహంకారము కలుగ నీయదు. అన్నింటనూ అంతటనూ సర్వవ్యాపక దైవమే ఉనికిని కలిగి ఉన్నదని దర్శించుము.

6.నిన్ను నీవు యెంతగా ప్రేమించు కొను చున్నావో నీకు తెలియును కనుక పొరుగు వానిని ప్రేమించుటలో అంతకంటే ఎక్కువగా ప్రేమించుచున్నావో లేదో పరిశీలించుకొనుము. అందరిలోనూ ప్రభువునే చూడ గలిగిన వానికి మాత్రమే ఇది సాధ్యము. విశ్వజనీన ప్రేమకు ఆధారమే నీలో నున్న  దేవుని ఆత్మకనుక. ''నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము''.

7. నీవు ఏమి చేసినను, ఏది అనుభవించినను, అది అంతయు నీవును, నీ ఇంద్రియములకును, నీ మనో బుద్ధుల వలన గాదని, దైవ నిర్ణమమే జరుగు చున్నదని గ్రహించుము. కనుక అన్నియు ''ప్రభువు పేరిట జరుగుచున్నవని'' విశ్వాసముతో నుండుము.

8. దేవుడు సకల జీవులను మంచి చెడులెంచక ప్రేమించును. అటులనే దేవుడు మనలను ప్రేమించి నట్లు, మనమును సకల జీవులను నిస్వార్ధముగా ప్రేమించ వలెను. నేను మిమ్ములను ప్రేమించుచున్నట్లు మీరు నన్ను ప్రేమించుడి!

9.''పభువా!ప్రభువా!అని నన్ను పిలుచు వాడును పరలోకరాజ్యమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును.''(మత్తయ 7ః21)

10. దేవుని చిత్తము సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలకు నిలయము. సహృదయులైన విశ్వాసుల జీవితమే దేవుని చిత్తమందలి ప్రణాళిక. సద్గురులైన యేసు కృపావరముచే దేవుని చిత్తానుసారము  అనగా ఆత్మానుసార జీవితముతో పరిశుద్ధాత్మ యగుదుము. ఆమెన్‌!